Telugu Gateway
Cinema

తెలంగాణ‌లో 'పుష్ప' దోపిడీ..ఐమ్యాక్స్ టిక్కెట్ ధ‌ర 250 రూపాయ‌ల‌కు పెంపు

తెలంగాణ‌లో పుష్ప దోపిడీ..ఐమ్యాక్స్ టిక్కెట్ ధ‌ర 250 రూపాయ‌ల‌కు పెంపు
X

గ‌తంలో పెద్ద సినిమాల రేటు 200 రూపాయ‌లు మాత్ర‌మే...ఇప్పుడు 50 అద‌న‌పు బాదుడు

ఏపీలో రేట్లు పెంచుకోవ‌టం చేతకాక తెలంగాణ‌లో దోపిడీ

దొరికిన ద‌గ్గ‌ర దోచుకో. ఏపీలో లాస్ తెలంగాణ‌లో క‌వ‌ర్ చేసుకో అన్న‌ట్లు ఉంది టాలీవుడ్ తీరు. తెలంగాణ‌లో అనుమ‌తిస్తున్నారు క‌దా అని అడ్డ‌గోలు దోపిడీకి తెర‌లేపారు. హైద‌రాబాద్ లోని ఐమ్యాక్స్ థియేట‌ర్ లో పుష్ప సినిమా ఒక్కో టిక్కెట్ పై 250 రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారు. గ‌తంలోనూ పెద్ద హీరోల సినిమాల టిక్కెట్ విడుద‌ల రోజు 200 రూపాయ‌లు ఉండేది. సాధార‌ణ రోజుల్లో అయితే ఐమ్యాక్స్ టికెట్ ధ‌ర 150 రూపాయ‌లే. కానీ ఇప్పుడు ఏకంగా 250 రూపాయ‌ల‌కు పెంచారు. అంటే మామూలు రోజుల‌తో పోలిస్తే ఒక్కో టిక్కెట్ పై వంద రూపాయ‌ల అద‌న‌పు బాదుడు అన్న మాట‌. అంటే న‌లుగురు ఉన్న ఓ ఫ్యామిలీ సినిమా చూడాలంటే కేవ‌లం టిక్కెట్ల కోస‌మే వెయ్యి రూపాయ‌లు ఖర్చు పెట్టాలి. ఏపీలో అక్క‌డి స‌ర్కారుతో మాట్లాడి రేట్లు పెంచుకోవ‌టం చేత‌కాక తెలంగాణ‌లో అనుమ‌తించారు క‌దా అని ఏకంగా ఒక్కో టిక్కెట్ పై వంద రూపాయ‌ల బాదుడుపై ప్రేక్షకులు మండిప‌డుతున్నారు. ఐమ్యాక్సే కాకుండా అన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో రేట్ల పెంపు ఇదే తీరుగా ఉంద‌ని స‌మాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేట‌ర్లు ఆ న‌లుగురి చేతిలో ఉన్న విష‌యం తెలిసిందే.

బ‌డా బ‌డా నిర్మాత‌లు వారే...ఎగ్జిబిట‌ర్లు వాళ్ళే..హీరోలు వాళ్ళ పిల్ల‌లే.అందుకే ఏపీలో వ‌చ్చే న‌ష్టాన్ని థియేట‌ర్లు ఎలాగూ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి క‌దా అని తెలంగాణ‌లో అడ్డ‌గోలు రేట్ల‌కు తెర‌తీశారు. పెంచుకోవ‌టం అంటే దానికీ ఒక ప‌రిమితి ఉంటుంది. కానీ మ‌రీ పుష్ప సినిమా రేట్లు చూస్తే మాత్రం ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఏపీలో అక్క‌డి ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ రేట్లు త‌గ్గించ‌టంతో తెలంగాణ‌లో గ‌తంలో ఉన్న దాని కంటే అద‌నంగా 50 రూపాయ‌ల అద‌న‌పు బాదుడుకు తెర‌తీశారు. ఈ తీరుపై సినీ ప్రేమికుల్లో విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. ఆంధ్రాలో రేట్లు పెంచ‌లేద‌ని..తెలంగాణ‌లో పెంచిన రేట్ల‌ను మ‌రింత పెంచ‌టం ఏమిటి అంటూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. మాట్లాడితే పైర‌సీని ప్రోత్స‌హించొద్దు..థియేట‌ర్లోనే సినిమా చూడండి అని నీతులు చెప్పేవాళ్లు రేట్లు పెంచే స‌మ‌యంలో కూడా అలాంటి విచ‌క్షణ ఉప‌యోగించాలి క‌దా?. ఎక్క‌డో వ‌చ్చే నష్టానికి ఇక్క‌డి ప్రేక్షకుల‌పై భారం వేయ‌టం ఏమిటి అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ పుష్ప రేట్ల దోపిడీపై తెలంగాణ స‌ర్కారు స్పందిస్తుందో లేక అలా వ‌దిలేసి ఊరుకుంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it