అల్లు అర్జున్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్
పుష్ఫ సినిమాలో ఒక పాపులర్ డైలాగు ఉంది. అదే తగ్గేదే లే. కానీ ఇప్పుడు తగ్గారు. తగ్గటం అంటే ఏకంగా భయపడ్డారు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ఫ 2 సినిమాను ఆగస్ట్ 15 న విడుదల చేయబోతున్నట్లు చాలా ముందుగానే ప్రకటించారు. అన్నీ చూసుకున్న తర్వాత కానీ..ఇంతటి భారీ బడ్జెట్ ...హైప్ ఉన్న సినిమా విషయంలో మేకర్స్ అలవోకగా విడుదల ప్రకటన చేయరు అనే విషయం తెలిసిందే. బెస్ట్ క్వాలిటీ అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మరి అంతకు ముందు ప్రకటన చేసిన సమయంలో ఏదో అలా చుట్టేసి విడుదల చేద్దామనుకున్నారా? అనే ప్రశ్న ఉదయించకమానదు. పోనీ ఏదైనా ఇతర కారణాల వల్ల షూటింగ్ కు బ్రేక్ వచ్చిందా అంటే అదేమీ లేదు. విడుదల తేదీ అనౌన్స్ చేసి...ప్రమోషన్స్ స్టార్ట్ చేసి...రెండు లిరికల్ సాంగ్స్ , టీజర్ కూడా విడుదల చేసిన తర్వాత క్వాలిటీ అవుట్ ఫుట్ గుర్తుకు వచ్చింది అంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు అనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
సినిమా విడుదల వాయిదాకు ప్రధాన కారణం...మెగా...అల్లు ఫ్యామిలీ మధ్య తలెత్తిన విభేదాలే కారణం అనే చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కి సంఘీభావం ప్రకటించి వచ్చారు. కుటుంబ సభ్యుడు అయిన పవన్ కళ్యాణ్ కు కేవలం ట్విట్టర్ ద్వారా విషెష్ చెప్పిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లి మరీ సంఘీభావం చెప్పిరావటం మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ మరింత పెంచిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై నాగబాబు ట్వీట్..తర్వాత అల్లు అర్జున్ కౌంటర్ లు కాక రేపాయి. ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ మధ్యలో అల్లు అర్జున్ ను సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో అయ్యారు. ఇది కూడా హాట్ టాపిక్ మారింది. ఆగస్ట్ 15 అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరి గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు. మరో వైపు టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వం దగ్గరకు పోవాలంటే ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం.
మరో కీలక విషయం ఏమిటి అంటే చంద్రబాబు క్యాబినెట్ లో టూరిజం, కల్చర్ తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కూడా జనసేన దగ్గర అంటే ఆ పార్టీ కి చెందిన కందుల దుర్గేష్ కు కేటాయించారు. ఇది అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలకు ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనే భయంతోనే ఈ పని చేశారు అని...కొత్త విడుదల తేదీ అయిన డిసెంబర్ 6 నాటికీ పరిస్థితులు కొంత సర్దుకుంటాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తీరుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంగా ఉండటంతో వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తారు అనే కారణం కూడా ఉంది. ఈ అన్నీ అంశాలు లెక్కలు వేసుకునే పుష్ఫ 2 విడుదల పోస్టుపోన్ చేసినట్లు చెపుతున్నారు. మరో వైపు ఇలాంటి భారీ హైప్ ఉన్న సినిమాలు విడుదల వాయిదా పడే కొద్దీ వాటిపై ప్రతికూల ప్రచారం కూడా పెరుగుతూపోతోంది.