జగన్ మీ బంధువు అయితే మా ఎన్నికలకు వస్తారా?
పెద్దల ఆశీర్వాదం నాకొద్దు...గెలిస్తే వారిని ప్రశ్నిస్తా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మా ప్రెసిడెంట్ గా బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తాపై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి. దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. నా అంత బాగా తెలుగులో విష్ణు ప్యానల్ లో ఎవరూ తెలుగు మాట్లాడలేరు. నన్ను పెంచింది తెలుగు భాష. ఎన్నికల్లో జగన్, కెసీఆర్, బిజెపిలను లాగుతారా?. జగన్ మీ బంధువు అయితే మా ఎన్నికలకు వస్తారా?. రెండుసార్లు హలో చెపితే కెటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? అవతలి వాళ్ళను ఓడించటానికి కాదు.
మీరు గెలవటానికి ప్రయత్నించండి. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానల్ కొట్టుకుబోతోంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగువాడిని కాదంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలపైనా ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. మా సిగ్గుపడేలా నరేష్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. తాము ప్రశ్నించకపోతే ఈ సారి మా ఎన్నికలే ఉండేవి కావన్నారు. ఎన్నికల గురించి ప్రశ్నించినందుకు తనను బెదిరించారన్నారు. ఓ వైపు మంచు విష్ణు సీనియర్ హీరోలు క్రిష్ణ, బాలక్రిష్ణ వంటి వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మాత్రం సమావేశాలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.