ఓడిపోతే గెస్ట్..మరి గెలిస్తే...!
ప్రకాష్ రాజ్. మళ్లీ అదే ఆవేశం. అదే తప్పు. ఓడిపోతే గెస్ట్..మరి గెలిచి ఉంటే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆయన అందుకు కారణాలుగా కోట శ్రీనివాసరావు, రవిబాబులు చేసిన వ్యాఖ్యలను కారణాలుగా చూపించారు. వాళ్ళ వ్యాఖ్యలకు బాధపడి ఉంటే..అభ్యంతరం ఉంటే ఆయన ఎన్నికలకు ముందే పోటీనుంచి తప్పుకుని ఉండాలి. అంతే కానీ సవాళ్ళ మీద సవాళ్ళు విసిరి ఎన్నికలు అయిపోయాక..ఓటమి పాలైన తర్వాత ఆ వ్యాఖ్యలను సాకుగా చూపటం అనేది విచిత్ర వాదనగా ఉంది. అంతే కాదు..మంచు విష్ణు ప్యానల్ గెలిస్తే స్థానికేతరులు పోటీచేయకూడదని బైలాస్ మారుస్తామని ప్రకటించారని.అందుకే అలాంటి మాలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. ఫలితాలు వచ్చిన రాత్రే ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచిన నాగబాబు కూడా మాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. మీడియాలో ప్రకాష్ రాజ్ మాటలు ఆయన వ్యాఖ్యలోనే...'నేను తెలుగు వాడిని కాదు. నా తల్లిదండ్రులు కూడా తెలుగువాళ్ళు కాదు. ఇది మా తప్పు కాదు. మా కు రాజీనామా బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ఆత్మగౌవరంతో తీసుకున్నా. తెలుగు వారు మాత్రమే మా అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు. అలానే చేశారు. ప్రాంతీయత ఆధారంగా మా ఎన్నిక జరిగింది. తెలుగు పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణము చేశా. అలానే పరిశ్రమలో కొనసాగుతా నటిస్తూ ఉంట. మంచు విష్ణుతోపాటు గెలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మీరు ఇచ్చిన హామీలు అమలుచేయండి. నాకు అండగా ఉన్న వారికి మా తో సంబంధం లేకుండా సహకరిస్తా. సేవ చేయాలంటే మాలో ఉండాలనేమీ లేదు. మా లో లేకపోతే అవకాశాలు ఇవ్వరా?. రాజకీయంగా కూడా నన్ను లాగి ట్వీట్ తో విశ్లేషణ చేసినందుకు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజాయ్ కి ధన్యవాదాలు.' అని వ్యాఖ్యానించారు.