హీరోలు ఓట్లు వేయటానికి కూడా రావట్లేదు
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు. సమావేశాలు..వాటికి కౌంటర్లు. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆదివారం రోజు పరిశ్రమకు చెందిన వంద మంది సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీరికి తాము గెలిస్తే ఏమి చేస్తామో చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సమస్యలపై వాకబు చేశారు. ఈ సమావేశంపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఇలాంటి సమావేశాలు ఏంటి అని..ఓట్లు కావాలంటే ఫోన్లు చేసి అడగాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. తాము కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సమావేశం పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితం వరకూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్న నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు జీవితకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీగా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నాటి సమావేశంలో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా లో సభ్యులుగా ఉన్న వారిలో చాలా మంది ఏ మాత్రం క్రియాశీలకంగా లేరన్నారు. కొంత మంది హీరోలు అయితే సభ్యులుగా ఉండి కూడా ఓట్లు వేయటానికి కూడా రావటం లేదన్నారు. తమ ప్యానల్ విజయం సాధిస్తే పది కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మా ప్రతిష్ట మసకబారటానికి కొంత మందే కారణం అన్నారు.