Telugu Gateway
Cinema

'మా' ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీల జోక్యం!

మా ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీల జోక్యం!
X

మా నాన్న‌కు ఫోన్ చేసి విష్ణును పోటీ నుంచి త‌ప్పుకోమ‌ని కోరారు

ఈ ఎన్నిక‌ల్లో పార్టీల జోక్యం వ‌ద్దు

మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు కూడా జోక్యం చేసుకుంటున్నాయా?. త‌మ‌కు అనుకూల‌మైన వారిని గెలిపించుకుకునేందుకు వ్యూహ‌లు ర‌చిస్తున్నాయా?. అంటే ఔన‌నే అనిపిస్తోంది మంచు విష్ణు వ్యాఖ్య‌లు చూస్తుంటే. శుక్ర‌వారం నాడు మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం మా ఎన్నిక‌ మాత్ర‌మే జ‌రుగుతున్నాయ‌ని...రాజ‌కీయాల‌తో వీటికి సంబంధం లేద‌న్నారు. మాలో అన్ని పార్టీల వారు ఉన్నార‌ని..రాజ‌కీయ పార్టీలు ఈ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కోరారు. విష్ణు ఎన్నిక‌ల్లో పాల్గొంటాడు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని తన తండ్రి మోహ‌న్ బాబు ఎవ‌రినీ అడ‌గ‌లేద‌న్నారు. అయితే విష్ణును ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోమ‌ని ఒక‌రు ఫోన్ చేశార‌న్నారు. ఆ తర్వాతే త‌న తండ్రి రంగంలోకి దిగార‌ని చెప్పారు. ఆరు వంద‌ల మందికి ఫోన్ చేసి విష్ణుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరార‌న్నారు. అంత‌కు ముందు వ‌ర‌కూ మోహ‌న్ బాబు ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేద‌న్నారు. మంచు విష్ణు వ్యాఖ్య‌ల‌తో మా రాజ‌కీయం మ‌రింత వేడెక్క‌టం ఖాయంగా క‌న్పిస్తోంది. మా ఎన్నిక‌ల్లో ప్యాన‌ల్ తో ముందుకొచ్చిన మంచు విష్ణు ప్ర‌త్యర్ధి ప్యాన‌ల్ పైసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అవ‌త‌లి ప్యాన‌ల్ లో చాలా మంది మంచి న‌టులు ఉన్నార‌ని..కానీ వారు మాత్రం మా కు ఎలాంటి సేవ చేయ‌లేర‌న్నారు. గ‌తంలో ఎప్పుడూ మా లో ఈ ప‌రిస్థితులు లేవ‌న్నారు. మా' ఎన్నికల్లో ఇంత పోటీ ఎప్పుడూ చూడలేదని, మా సభ్యులు గ్రూపులుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తీరుపై ఎవరూ సంతోషంగా లేరని, ఎన్నికల గురిం‍చి మీడియా, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధకరమన్నారు. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్‌ సభ్యులను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'మా'లో మార్పు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికి మెడికల్‌ ఇన్సురెన్స్‌ కల్పిస్తాం అని విష్ణు అన్నారు. ఇక తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అక్టోబరు 10న 'మా' ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు.

Next Story
Share it