Telugu Gateway
Cinema

దర్శకుడు బుచ్చిబాబు ఆ గండం గట్టెక్కినట్లేనా?!(Peddi Movie Review)

దర్శకుడు బుచ్చిబాబు ఆ గండం గట్టెక్కినట్లేనా?!(Peddi Movie Review)
X

ఈ ఏడాది సంక్రాంతి తర్వాత సరైన హిట్ లేక డీలాపడిన టాలీవుడ్ పెద్ది మూవీ సక్సెస్ పై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సమ్మర్ లో విడుదల అయిన భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే. మరో వైపు ఆర్ఆర్ఆర్ వంటి హిట్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ కు పెద్ది మూవీ తో హిట్ కొట్టడం ఎంతో కీలకంగా మారింది. పలు వాయిదాల అనంతరం దర్శకుడు సానా బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది మూవీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే విజయనగరం జిల్లాలోని ఏ మాత్రం గుర్తింపు లేని ఒక గ్రామం...ఆ గ్రామానికి స్పోర్ట్స్ కు ఉన్న లింక్ ఏంటి అన్నదే ఈ మూవీ. ఈ గ్రామంలోనే పెద్ది ఆట కూలీగా పని చేస్తుంటాడు. ఇతర పనులు కూడా చేసుకుంటూ తన కుటుంబాన్ని నడుపుతాడు. ఆ గ్రామానికి...స్పోర్ట్స్ కు లింక్ పెట్టి దర్శకుడు బుచ్చిబాబు కథ నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. ఆట కూలీగా ఉన్న పెద్దిని వేలంలో కొనుక్కుని తమ తరపున ఆడినందుకు కొంత మొత్తం చెల్లిస్తూ ఉంటారు. పెద్ది క్రికెట్ ఫీల్డ్ లోకి దిగాడు అంటే ఇక ఆ టీం కు తిరుగుతుండదు.

క్రికెట్ ప్లేయర్ గా ఉన్న పెద్ది ఆ తర్వాత ఎందుకు కుస్తీ పోటీల వైపు వెళ్లాల్సి వచ్చింది. తన ఆట ద్వారా కొండ కింద గ్రామానికి...తనకు ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చాడు..దీనికోసం హీరో పడిన కష్టం ఏమిటి అన్నదే పెద్ది మూవీ. పెద్ది మూవీ టేకాఫ్ బాగానే జరిగినా..మధ్యలో కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఆ కొద్ది సేపు తప్ప...తర్వాత మూవీ అంతా కూడా ట్రాక్ లోనే వెళుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో రామ్ చరణ్ ఒంటి చేత్తో ఈ సినిమా భారం అంతా మోశారు. ఆయన తర్వాత స్థానం మేక్ ఓవర్ విషయంలో ..సినిమాలో అత్యంత ప్రభావం చూపించింది అంటే జగపతి బాబు పోషించిన అప్పలసూరి, గౌర్ నాయుడు పాత్ర పోషించిన శివరాజ్ కుమార్ లే. అటు క్రికెటర్ గా ..ఇటు కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు అత్యంత బలం చేకూర్చింది అంటే ఏ ఆర్ రెహ్మాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి.

ఈ మూవీ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెండి తెర మీద కూడా బాగున్నాయి....ముఖ్యంగా పాటలు అన్నింటిలో రామ్ చరణ్ తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ జాన్వికపూర్ కు ఈ మూవీ లో కూడా పెద్దగా నటించే స్కోప్ రాలేదు . ఎక్కువ భాగం గ్లామర్ షో తో సాగిపోయింది. అత్యంత సాదాసీదా కథతో..స్పోర్ట్స్ కు లింక్ పెట్టి మూడు గంటలకు పైగా మూవీని నడిపించటం అంటే మాములు విషయం ఏమి కాదు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సీరియస్ కథలో చికిరి సాంగ్ తో పాటు ఐటెం సాంగ్ కూడా జోడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో చాలా వరకు విజయం సాధించినట్లే లెక్క. మొత్తం మీద పెద్ది సినిమా హీరో రామ్ చరణ్ కు..దర్శకుడు బుచ్చిబాబు కు హిట్ అందించింది అనే చెప్పాలి.

రేటింగ్ : 3 /5

Next Story
Share it