వరసగా పవన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇక పండగే. పెండింగ్ లో పడిపోయిన ఆయన సినిమాలు వరస పెట్టి విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే హరి హర వీర మల్లు విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా జూన్ 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఓజీ విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. కొత్త విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్ టైన్మెంట్ ప్రకటించింది. దసరా కు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలు అన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే తొలుత హరి హర వీర మల్లు పూర్తి చేసుకుని ఇప్పుడు ఓజీ సినిమా కు టైం కేటాయించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సాగుతున్నట్లు కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత తన ఫోకస్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పెట్టనున్నట్లు చెపుతున్నారు. ఈ లెక్కన పెండింగ్ లో ఉన్న సినిమా లు అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవి పూర్తి అయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తారా లేదా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.