ఓజీ టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణా లో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ మూవీ టికెట్ రేట్ల పెంపునకు అనుమతి వచ్చింది. అంతే కాదు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా ఓజీ సినిమా ప్రీమియర్ షోస్ కు అనుమతి కూడా ఇచ్చారు. 24 రాత్రి తొమ్మిది గంటలకు స్పెషల్ షో కు అనుమతి ఇస్తూ ఈ షో టికెట్ రేట్ ను 800 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో అయితే స్పెషల్ షో టికెట్ రేట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయిస్తే...తెలంగాణాలో 800 రూపాయలుగా ఖరారు చేశారు. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు...మల్టీప్లెక్స్ ల్లో 150 రూపాయల మేర టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ సర్కారు మెమో జారీ చేసింది.
ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 21 ఉదయం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా హైప్ ఒక రేంజ్ కు చేరింది. దసరా సెలవుల్లో ఇతర సినిమా లు ఏమి లేకుండా ఓజీ సింగిల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయనుంది. హైప్ కు అనుగుణంగా సినిమా కు పాజిటివ్ టాక్ వస్తే ఇది కొత్త రికార్డు లు నమోదు చేయటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటించింది. ఇటీవల విడుదల అయిన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.



