Telugu Gateway
Cinema

పదకొండు కోట్ల రూపాయల అడ్వాన్స్ వెనక్కి

పదకొండు కోట్ల రూపాయల  అడ్వాన్స్ వెనక్కి
X

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఒక సారి ఆయనే ఈ విషయం ఒక పొలిటికల్ మీటింగ్ లో చెప్పారు. తనకు సినిమాల నుంచే డబ్బులు వస్తాయి తప్ప మరో వ్యాపారం లేదు అంటూ వెల్లడించారు. రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత అయన సినిమాలు అన్నీ పట్టాలు తప్పాయి అనే చెప్పాలి. ఒక్కో సినిమా పూర్తి చేయటానికి సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుంది. దీంతో నిర్మాతలపై విపరీతమైన భారం పడుతోంది అనే చెప్పాలి. ఎప్పుడో 2020 సంవత్సరంలో అధికారికంగా మొదలైన హరి హర వీర మల్లు మూవీ 2025 లో పూర్తి అయింది. ఈ సుదీర్ఘ జాప్యంతో తొలుత ఈ సినిమా మొదలు పెట్టిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వటంతో చిత్ర యూనిట్ ఎలాగోలా ఈ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసింది. ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియటంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం అడ్వాన్స్ గా తీసుకున్న పదకొండు కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత పెండింగ్ లో ఉన్న పోర్షన్ మొత్తాన్ని నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది. అయితే ముందు ప్రకటించినట్లు మరో సారి ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఇప్పటి వరకు సినిమా సెన్సార్ పూర్తి చేసుకోకపోవడం...సినిమా ట్రైలర్ విడుదల కూడా జరగకపోవటంతో మరో సారి హరిహర వీర మల్లు వాయిదా పక్కా అని...జులై లో ఈ మూవీ విడుదల ఉండే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకా ఓజీ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.

Next Story
Share it