నీల్..ఎన్టీఆర్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికా లో!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ మంగళవారం నాడు హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ ను సందర్శించారు. ఎన్టీఆర్ కొత్త సినిమాలను అమెరికా లో చిత్రీకరించనున్నట్లు అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ వెల్లడించారు. ఈ షూటింగ్స్ తో రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం అవటంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుతుంది అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. యూఎస్ కాన్సులేట్ కు ఎన్టీఆర్ ను స్వాగతించటం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇటీవలే ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారి నేరుగా చేసిన బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ లో నటిస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికా లో జరిగే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అయిన తర్వాత మరో సారి ఈ హీరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ప్రాజెక్ట్ చేయనున్నారు.



