బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు నోయల్
ఈ సారి తెలుగు బిగ్ బాస్ కు కాలం కలసి వస్తున్నట్లు లేదు. ప్రారంభంలో మినహా షో అంతా డల్ గా మారిపోయింది. జోష్ నింపే టాస్క్ లు లేవు..అలరించే క్యారెక్టర్లు లేవు. దీంతో ఏదో రొటీన్ గా చప్పచప్పగా సాగిపోతుంది. ఈ తరుణంలో వరస పెట్టి బిగ్ బాస్ హౌస్ సభ్యులకు అనారోగ్య సమస్యలు. ఇప్పటికే గంగవ్వ అనారోగ్యంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోగా తాజాగా నోయల్ దీ అదే పరిస్థితి. మరింత మెరుగైన వైద్యం కోసం అని నోయల్ ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేశారు. బుధవారం రాత్రి ప్రసారం అయిన బిగ్ బాస్ ప్రోగ్రాంలోనే నోయల్ తన అసక్తతను వ్యక్తం చేశారు.
హౌస్ లో ఉన్నంత కాలం ఎక్కడా పెద్దగా వివాదాల జోలికి వెళ్లకుండా హుందాగానే వ్యవహరించారు. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే హడావుడి చేయకుండా తన ఆట ఏదో తాను ఆడుతూ ముందుకు సాగాడు. కొద్ది రోజుల క్రితం కూడా నోయల్ తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, గంగవ్వ లాగే వెళ్లిపోతానని చెప్పాడు. అయినా సరే ఇన్నివారాలు తన బాధను భరిస్తూ హౌస్‌లో నెట్టుకువచ్చాడు. తాజాగా బిగ్ బాస్ నోయల్ ను హౌస్ నుంచి పంపటానికి అనుమతించాడు. అయితే ఈ పరిణామం నోయల్ అభిమానులను షాక్ కు గురిచేసింది.