Telugu Gateway
Cinema

టాలీవుడ్ కు 'మేలుకోలుపు' ఆ మూడు సినిమాలు

టాలీవుడ్ కు  మేలుకోలుపు ఆ మూడు సినిమాలు
X

ఓ వైపు టాలీవుడ్ అగ్ర‌హీరోలు అంద‌రూ మారిన తెలుగు ప్రేక్షకుల అభిరుచి చూసి టెన్ష‌న్ ప‌డుతున్న వేళ చిన్న సినిమాలు టాలీవుడ్ లో దుమ్మురేపాయి. సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నా క‌థలో ద‌మ్ము లేక‌పోతే దాన్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌నే విష‌యం ఈ మ‌ధ్య చాలా సినిమాలు నిరూపించాయి. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు క‌ల‌సి చేసిన ఆచార్య సినిమా. టాప్ హీరో ప్ర‌భాస్ కు చెందిన రాధే శ్యామ్ కూడా ఇదే బాప‌తు. సినిమా క‌థ‌లో ద‌మ్ముఉండి..టేకింగ్ లో ద‌ర్శ‌కుడు కొత్త‌ద‌నం చూపిస్తే ప్ర‌భాస్, చిరంజీవిల ఇమేజ్ ఆ సినిమా క‌లెక్షన్లు పెంచ‌టానికి ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కాక‌పోతే అత్యంత కీలక‌మైన క‌థ‌లోనే వీక్ నెస్ ఉంటే ఎంత పెద్ద టాప్ హీరో అయినా ఏమీచేయ‌లేర‌ని ఎన్నోసార్లు నిరూపితం అయింది. ఏకంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఆపుకుని మ‌రీ నిర్మాత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న వేళ మూడు చిన్న సినిమాలు సాధించిన సంచ‌ల‌న విజయాలు ప‌రిశ్ర‌మ‌కు ఓ పెద్ద మేలుకొలుపు అని చెప్పుకోవ‌చ్చు.

క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన బింబిసార‌, దుల్క‌ర్ స‌ల్మార్ హీరోగా వ‌చ్చిన సీతారామం, నిఖిల్ హీరోగా వ‌చ్చిన కార్తికేయ2లు బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టాయి. ఈ సినిమాలు అన్నింటికి మ‌ల్లీప్లెక్స్ లో 200 రూపాయ‌ల ధ‌ర పెట్టినా ప్రేక్షకులు క్యూక‌ట్టి మ‌రీ సినిమాలు చూశారు. వాస్త‌వానికి ఈ హీరోల రేంజ్ కు..ఈ రేటు ఎక్కువే. అయినా స‌రే ప్రేక్షకులు డ‌బ్బు విష‌యంలో ఏ మాత్రం వెన‌కాడ‌కుండా థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. వీటి అన్నింటి కంటే ముఖ్యం సినిమాపై వ‌చ్చే టాక్ కూడా అత్యంత కీలకంగా మారింది. ఇటీవ‌ల వ‌చ్చిన ది వారియ‌ర్, థ్యాంక్యూ, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలు దారుణ ప‌రాభ‌వాన్ని చ‌విచూసిన‌ట్లు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల టాక్. అయితే ఖ‌చ్చితంగా ప‌రిశ్ర‌మ సినిమా టిక్కెట్ రేట్ల విష‌యంలో పున‌రాలోచ‌న చేయ‌కుంటే మాత్రం రాబోయే రోజుల్లో తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Next Story
Share it