అనిల్ రావిపూడి ప్రమోషన్స్ తో జోష్

ఈ సంక్రాంతి సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఒకటి. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కావటం దీనికి ఒకెత్తు అయితే ...ఆయన తనదైన మార్క్ ప్రమోషన్స్ తో ఈ మూవీని ఇతర సినిమాలతో పోలిస్తే బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. సంక్రాంతి పండగ సీజన్ లో ఫస్ట్ విడుదల అయ్యేది ప్రభాస్ రాజాసాబ్ అయితే...రెండవ సినిమా గా మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. దీని ప్రకారం ఈ మూవీ ట్రైలర్ జనవరి నాలుగున విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ వస్తే ఆ ఆసక్తి మరో స్థాయికి వెళ్లడం ఖాయం అనే చెప్పొచ్చు.ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు.
క్యాథరిన్ థ్రెసా, సునీల్, వీటీవీ గణేష్, రేవంత్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ ట్రైలర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవిని ఎలా చుపించారో అన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్ లో ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని చిరంజీవిని ఇందులో చూస్తారు అంటూ ఆయన ఫ్యాన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు హీరోయిన్ నయనతార కూడా గత రూల్స్ బ్రేక్ చేసి మరీ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
నూతన సంవత్సరం తోలి రోజు రిలీజ్ చేసిన నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి చేసిన వీడియో ఒకటి ఆకట్టుకుంది. అది కూడా దర్శకుడితో హీరోయిన్ ప్రమోషన్స్ సంగతి ఏంటి అని అడిగించటం...మీరు ఒక్క రిలీజ్ డేట్ చెప్పండి చాలు అని అనిల్ రావిపూడి చెప్పటం హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ లో హీరో వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదల అయిన చిరు, వెంకీ పాట కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఒకే సారి సంక్రాంతికి టాలీవుడ్ నుంచే ఏకంగా ఐదు సినిమాలు వస్తుండటంతో ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంటుంది అన్నది ఇప్పుడు అందరిని టెన్షన్ పెడుతున్న అంశం. రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా కలుపుకుంటే ఏకంగా మొత్తం ఏడూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.



