ఛాన్స్ ఇస్తే ఇలాగా చేసేది!

ఫస్ట్ ప్రీమియర్ షోస్ రద్దు అన్నారు. గురువారం రాత్రికి ఎరోస్ ఇంటర్నేషనల్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మధ్య ఆర్థిక వివాదం సెటిల్మెంట్ అయిపోతుంది అని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇది ఒక కొలిక్కి రాకపోవటంతో శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అఖండ 2 తాండవం సినిమా విడుదల ఆగిపోయింది. ఇది బాలకృష్ణ అభిమానులకు ఏ మాత్రం మింగుడుపడని పరిణామంగా మారింది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా నిర్మాతలు రామ్ ఆచంట...గోపి అచంటలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అందరిలో ఆసక్తి పెరుగుతుంది. దీనికి తోడు అఖండ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవటంతో దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవంపై అంచనాలు ఇప్పటికే ఒక రేంజ్ కు వెళ్లాయి.
అంతా అఖండ 2 మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మద్రాస్ హై కోర్ట్ జారీచేసిన ఇంజక్షన్ ఆర్డర్ ఈ సినిమా విడుదలకు బ్రేక్ లు వేసింది. ప్రీమియర్స్ ఆగిపోయినా కూడా శుక్రవారం నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయని భావించిన వాళ్లకు షాక్ ఇస్తూ చిత్ర నిర్మాణ సంస్థ గురువారం అర్ధరాత్రి సినిమా విడుదల కావటం లేదు అంటూ ప్రకటన జారీ చేసింది. ఎంతో బాధతో ఈ ప్రకటన జారీ చేస్తున్నామని..అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు ఇది నిరాశ కలుగచేసే నిర్ణయం అని తమకు తెలుసన్నారు. సాధ్యమైనంత వేగంగా సమస్య పరిష్కారం కోసం తాము పని చేస్తున్నామని..ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రకటనలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకులకు పాజిటివ్ అప్డేట్ ఇస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా అన్న చర్చ తెర మీదకు వచ్చింది.



