Telugu Gateway
Cinema

స్టైలిష్ లుక్ లో నాగార్జున

స్టైలిష్ లుక్ లో నాగార్జున
X

అక్కినేని నాగార్జున వందవ సినిమా అప్ డేట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా కూడా ఈ మూవీకి చెందిన విషయాలు ఏవీ కూడా అధికారికంగా బయటకు రాలేదు. ఆగస్ట్ 29 న నాగార్జున పుట్టినరోజు కావటంతో చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నాగార్జున వందవ సినిమా గ్లింప్స్‌ విడుదల చేసింది. కింగ్ 100 పేరుతోనే ఈ గ్లింప్స్‌ విడుదల చేయటంతో సినిమా టైటిల్ గా ఇదే ఉంటుందా లేక కొత్త పేరుతో వస్తారా అన్నది కొద్దిరోజులు పోతే కానీ తేలదు. కాకపోతే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించారు. దీని ప్రకారం ఈ మూవీ డిసెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మనుషులు రెండు రకాలు. డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు అంటూ నాగార్జున చెప్పే డైలాగుతో గ్లింప్స్‌ మొదలవుతుంది. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మీ ఏ కింగ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుంటే...దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ గ్లింప్స్‌ లో నాగార్జున స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. ఇందులో టబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టబు తో పాటు ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ కూడా హీరోయిన్లు గా కనిపించనున్నట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ మాత్రం ఈ వివరాలు వెల్లడించలేదు.

Next Story
Share it