టాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువయ్యాయి
'రెచ్చగొట్టొద్దు...రెచ్చగొట్టొద్దు. మనం అంతా ఒక్కటే. మనం అంతా ఒక్కటే. ఎంత చిన్నవాడు అయినా రెచ్చగొడితే తిరగబడాలి అని చూస్తాడు' అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసలు రాజకీయాల్లో కంటే టాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. మంచు విష్ణు త్వరలోనే తెలంగాణ సీఎంను కలసిన తర్వాత ఏపీలోని అక్కడి ముఖ్యమంత్రితో సమావేశం అవుతారని తెలిపారు. మా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్ తోపాటు మోహన్ లాల్ ను కూడా ఆహ్వానించామని..వేరే చోట్ల ఉండటం వల్ల రాలేకపోయారని..విష్ణుకు ఆశీర్వాదాలు పంపారన్నారు. తనకు పగ, రాగద్వేషాలు లేవన్నారు. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని తెలిపారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని వ్యాఖ్యానించారు. నువ్వు గొప్పా..నేను గొప్పా అన్న చర్చలు సరికాదన్నారు. టాలెంట్ ఒక్కటే పరిశ్రమలో నిలబడుతుందని అన్నారు. బెదిరింపులకు కళాకారులు ఎవరూ భయపడరన్నారు. సీఎం కెసీఆర్ ఖచ్చితంగా పరిశ్రమకు, పరిశ్రమలోని వ్యక్తులకు సాయం చేస్తారని చెప్పారు. అవసరం అయితే తాను కూడా వెళ్లి కలుస్తానన్నారు. చేసిన హామీలు మామూలు విషయాలు కాదని..వాటిని తప్పక అమలు చేస్తారన్నారు.
ఎంతో మంది మహమహులు ఏర్పాటు చేసింది మా కుర్చీ అన్నారు. ఆ కుర్చీని గౌరవించండి..అందరూ కలసి మెలసి ఉండాలని సూచించారు మోహన్ బాబు. ఎంటర్ టైన్ మెంట్ నటనలో ఉండాలి కానీ..దుర్భాషలాడుకునే ఎంరట్ టైన్ మెంట్ వద్దు. మీలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకోండి కానీ టీవీలకు ఎక్కవద్దన్నారు. సైలంట్ గా ఉండి అనుకున్నది సాధించాలని విష్ణు వెంటపడండి అన్నారు. మా మాజీ ప్రెసిడెంట్ నరేష్ మాట్లాడుతూ మా ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. మా ప్రెసిడెంట్ ను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. మంచు కమిటీ... మంచి కమిటీ అన్నారు. మా ఎవరికీ రిపోర్ట్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. వెబ్ సైట్‌లో పెడతాం.. అందరూ చూసుకోవచ్చని తెలిపారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ తాము కొత్త కమిటీని ప్రశ్నిస్తూ ఉంటామని..ప్రతి నెలా మ్యానిఫెస్టో అమలుపై నివేదికలు అడుగుతామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నరేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.