దీపావళి ఫస్ట్ సినిమా లో కామెడీ పేలిందా?!(‘Mithramandali Movie Review)

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో మిరాయి తో పాటు లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ దీపావళి సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాల హంగామానే ఎక్కువ ఉంది. ఇందులో మొదటిది మిత్రమండలి మూవీ. గురువారం నాడు విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోస్ హైదరాబాద్ లో బుధవారం రాత్రే వేశారు. మిత్రమండలి సినిమాలో ప్రియదర్శి, నిహారిక, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు విజయేందర్ ఈ సినిమాను తెరకెక్కించగా ...ఈ సినిమాను నిర్మాత బన్నీ వాసు సమర్పించారు. ఈ సినిమాలో పెద్ద కథ ఏమి ఉండదు అని సినిమా స్టార్టింగ్ లోనే చెప్పేశారు. చెప్పినట్లే ఇందులో కథ గురించి పెద్దగా అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
ఈ సినిమా అంతా కేవలం ఒక కులం...ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూనే తిరుగుతుంది. తమ కులం ఎంతో ప్రత్యేకం అని...అదే కులం బలంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని వీటివి గణేష్ ప్రయత్నం చేస్తుంటారు. ఆయన కూతురే హీరోయిన్ నిహారిక. కులం పిచ్చి ఉన్న గణేష్ తన కూతురు ప్రేమించిన వాడితో లేచిపోయింది అని బయటకు తెలిస్తే పరువు పోతుంది అని భావించి తన కూతుర్ని కిడ్నాప్ చేశారు అని పోలీస్ లకు ఫిర్యాదు చేస్తాడు. ఎవరికీ తెలియకుండా లేచిపోయిన తన కూతురిని వెనక్కి తెచ్చుకుని తన కులంలో పరువు పోగొట్టుకోకుండా చూసుకోవాలనే ప్రయత్నాలతోనే సినిమా అంతా సాగుతుంది. ఇందులో ఉండటానికి చాలా మంది మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులు ఉన్నా కూడా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
కథ లేదు కదా అని సినిమా అంతా నవ్వించే ప్రయత్నం చేసినా అది అక్కడక్కడా తప్ప పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మరో వైపు విటివి గణేష్ గణేష్ రోల్ మరీ అతిగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది ప్రేక్షకులకు. హీరోయిన్ నిహారిక కు దక్కింది కూడా ఇందులో పెద్దగా ప్రభావం చూపించే పాత్రేమీ కాదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరుతో సత్య చేసే హంగామా అక్కడక్కడా కాస్త నవ్వు తెప్పిస్తుంది. కాకపోతే పదే పదే అదే హంగామా చేయటంతో అది కూడా తేలిపోయినట్లు అయింది. విష్ణు అక్కడక్కడ నవ్విస్తే.... ప్రసాద్ బెహ్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. విజయ్ ఆంటోనీ పాత్రలో కనిపించిన వంశి కూడా కొంత మేర నవ్విస్తాడు. ఇంతకు మించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు.
రేటింగ్ : 2 .25 -5



