హైప్ కొనసాగిస్తున్న తేజా సజ్జ

తేజ సజ్జా హీరో గా నటిస్తున్న సినిమా మిరాయి. ఈ సినిమా గ్లింప్స్ విడుదల అయిన దగ్గర నుంచి కూడా ఈ మూవీ పై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. టీజర్ కూడా మిరాయి సినిమా ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ గా నిలవబోతుంది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తేజా తో పాటు మరో కీలక పాత్రలో మంచు మనోజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తేజా కు జోడిగా రితిక నాయక్ నటిస్తోంది. చిత్ర యూనిట్ శనివారం నాడు ఈ సినిమా నుంచి వైబ్ ఉంది బేబీ పాటను విడుదల చేసింది. ఈ పాట ఆకట్టుకునేలా ఉంటే..ఇందులో తేజా స్టెప్స్ ..హీరోయిన్ లుక్స్ కూడా జోష్ తెచ్చేలా ఉన్నాయనే చెప్పాలి.
ఫస్ట్ నుంచి ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ ను ఈ ఫస్ట్ సింగిల్ కూడా కొనసాగించింది అనే చెప్పొచ్చు. తేజ సజ్జా హను మాన్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్ళీ అదే తరహాలో ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తో వస్తున్న విషయం తెలిసిందే. వైబ్ ఉంది బేబీ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందిస్తే..అర్మాన్ మాలిక్ పాడారు. పేరుకు తగ్గట్టే ఈ పాటలో వైబ్ ఉంది అనే చెప్పొచ్చు. మొత్తం ఏడు భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ ని నిర్మిస్తోంది.



