Telugu Gateway
Cinema

ఏపీస‌ర్కారుతో టిక్కెట్ల పంచాయ‌తీ...మెగా స్టార్ మిడిల్ డ్రాప్!

ఏపీస‌ర్కారుతో టిక్కెట్ల పంచాయ‌తీ...మెగా స్టార్ మిడిల్ డ్రాప్!
X

టిక్కెట్ల పంచాయ‌తీ ప్ర‌భావ‌మేనా?

బ‌హిరంగ వేదిక మీద నుంచి ఓ సారి ఏపీ సీఎం జ‌గ‌న్ ను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు తీర్చండి అని కోరారు. మ‌రోసారి ట్వీట్ కూడా చేశారు. కానీ అక్క‌డ నుంచి స్పంద‌న శూన్యం. పైగా మంత్రులు..ప్ర‌భుత్వం ఇంకా ఎదురుదాడి మార్గంలోనే ఉంది. ఈ తరుణంలో ఓ స‌మావేశంలో మాట్లాడిన చిరంజీవి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌రిశ్ర‌మ పెద్ద‌గా ఉండటం చాలా క‌ష్టం అని..అలాంటి హోదాలు..ప‌దవులు త‌న‌కొద్ద‌న్నారు. అయితే ప‌రిశ్ర‌మ‌లో ఈ విభాగానికి స‌మ‌స్య వ‌చ్చినా త‌న వంతు సాయం చేయ‌టానికి సిద్ధం అని ప్ర‌క‌టించారు. ఇద్ద‌రు కొట్టుకుని వాళ్లిద్ద‌రి మ‌ధ్య పంచాయ‌తీలు చేసి..తీర్పులు ఇవ్వ‌మంటే అది త‌న‌తో కాద‌న్నారు.ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదన్నారు.ఈ వ్యాఖ్య‌లు చూస్తుంటే మెగాస్టార్ మిడిల్ డ్రాప్ అయిన‌ట్లే క‌న్పిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. సినిమా టిక్కెట్ రేట్లు పెంచినందుకు తాజాగా తెలంగాణ సీఎం సీఎం కెసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు చిరంజీవి. కానీ ఏపీలో మాత్రం ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ త‌రుణంలో చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. రెండు రోజుల క్రితం సీఎం జ‌గ‌న్ తో చిరంజీవి భేటీ కానున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ అదేమీ జ‌ర‌గ‌లేదు. అస‌లు చిరంజీవి ప్ర‌య‌త్నం చేశారా లేదా అన్న అంశంపై కూడా స్ప‌ష్ట‌త లేదు. ఈ త‌రుణంలో చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు ఏపీ సర్కారుతో ప‌రిశ్ర‌మ‌కు ఏర్ప‌డిన విభేదాల వ‌ల్లే అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఆదివారం నాడు చిరంజీవి యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమ లోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది ఈ సంస్థ‌. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'కరోనా ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది ఆప్తుల్ని, మిత్రుల్ని కోల్పోయాము.

ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందర్నీ కాపాడాలని ఆలోచన చేశాను. రోగం వచ్చాక బాధపడేకంటే రోగ నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. హెల్త్‌ కార్డుల కోసం అడిగితే యోధ లైఫ్‌ లైన్‌ చైర్మన్‌ సుధాకర్‌ సానుకూలంగా స్పందించారు. కేవలం మెంబర్స్‌కు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం అవకాశం కల్పించారు. ఈ హెల్త్‌ కార్డ్‌, దీని క్యూఆర్‌ కోడ్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు 7,699 కార్డులు రెడీ అయ్యాయి. మిగతావన్నీ ఈ నెలాఖరుకు పూర్తవుతాయి' అని తెలిపారు. స‌హజంగా సినీ ప‌రిశ్ర‌మ‌లోని హీరోల‌కు కొత్త కొత్త హోదాలు.బిరుదులు త‌గ‌లిస్తుంటే ఎంజాయ్ చేస్తారు. అలాంటిది చిరంజీవి బ‌హిరంగంగా త‌న‌కు పెద్ద‌రికాలు వ‌ద్దు అని చెప్ప‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదే చిరంజీవి గ‌తంలో ప‌లు అంశాల్లో ముందు ఉండి చొర‌వ తీసుకునే వారు. ఇప్పుడు మాత్రం దూరం దూరం అంటున్నారు. మ‌రో విశేషం ఏమిటంటే ఏపీ స‌ర్కారు, ప‌రిశ్ర‌మ‌కు టిక్కెట్ల రేటుపై పెద్ద వివాదం న‌డుస్తుంటే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కానీ..సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కానీ నోరెత్త‌టం లేదు. ఇది కూడా ప‌రిశ్ర‌మ‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Next Story
Share it