మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంచు విష్ణు బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. నరేష్ నుంచి ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సారి మా ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేని రీతిలో కొత్త కొత్త వివాదాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన సభ్యులు అందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజీనామాల వ్యవహారంపై మంచు విష్ణు ఇప్పటివరకూ స్పందించలేదు.
అయితే విష్ణుకు అండగా నిలిచిన నరేష్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందిస్తూ రాజీనామాలు వాళ్ల విజ్ణతకే వదిలేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఫలితాలను గౌరవించి హుందాగా వ్యవహరించాలి కానీ..ఓడిపోతే పదవులు వదిలేస్తామనటం సరికాదున్నారు. మోడీ గెలిచినందుకు కాంగ్రెస్ వాళ్ళు దేశం వదిలిపెట్టి పోయారా అని ప్రశ్నించారు. బయట ఉండి ప్రశ్నిస్తున్నామని చెబుతున్నారని..మీడియా అడగ్గా..ప్రశ్నించమనండి..తమ దగ్గర సమాధానాలు లేకపోతే కదా సమస్య అని నరేష్ వ్యాఖ్యానించారు.