Telugu Gateway
Cinema

మీ నిర్ణ‌యం స‌రికాదు..ప్ర‌కాష్ రాజ్ తో మంచు విష్ణు

మీ నిర్ణ‌యం స‌రికాదు..ప్ర‌కాష్ రాజ్ తో మంచు విష్ణు
X

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా ) ఎన్నిక‌ల అనంత‌రం కూడా ఎన్నిక‌ల ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఫ‌లితాలు వెల్ల‌డైన కొద్దిసేప‌టికే నాగ‌బాబు మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఉద‌యం మా ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్ గా పోటీచేసిన ప్ర‌కాష్ రాజ్ కూడా స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు. ఇదే అంశంపై ఆయ‌న కొత్త‌గా ఎన్నికైన మంచు విష్ణుకు మెసేజ్ చేశారు. 'మా' ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయానికి అభినందనలు విష్ణు. 'మా'ను నడిపించేందుకు అవసరమైన శక్తి నికు కలగాలని ఆశిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్‌-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ... ప్రకాశ్‌రాజ్‌'' అని మెసేజ్‌ పంపారు.

దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ.. మీ నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను అంకుల్‌ అంటూ ఆయ‌న‌కు స‌మాధానం ఇచ్చారు. 'అంకుల్‌ మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు. గెలుపు, ఓటములు అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు ముఖాలు. రెండింటిని మనం సమానంగా చూడాలి' అని అన్నారు. 'మీరు మా కుటుంబంలో ఒక భాగం. అది మీకు కూడా తెలుసు. ప్లీజ్‌ మీరు భావోద్యేగానికి లోనవకండి. నాకు మీ సలహాలు, సూచనలు అవసరం, మనిద్దరం కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. దీనిపై చర్చించుకుందాం. అప్పటి వరకు మీరు వెళ్లకండి' అంటూ సమాధానం ఇచ్చాడు. అంతే కాదు ఈ మెసేజ్ ల స్క్రీన్ షాట్ల‌ను మంచు విష్ణు ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Next Story
Share it