Telugu Gateway
Cinema

లోకేష్ ఓట‌మికి ప్ర‌చారం చేసినా బాల‌య్య మ‌న‌సులో పెట్టుకోలేదు

లోకేష్  ఓట‌మికి  ప్ర‌చారం చేసినా బాల‌య్య మ‌న‌సులో పెట్టుకోలేదు
X

మోహ‌న్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గురువారం నాడు త‌న కుమారుడు, మా నూత‌న ప్రెసిడెంట్ మంచు విష్ణుతో క‌ల‌సి బాలకృష్ణతో స‌మావేశం అయ్యారు. బాలకృష్ణను ఆయ‌న ఇంటికి వెళ్ళి క‌ల‌సి మంచు విష్ణుకు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెల‌ప‌టంతోపాటు...కొత్త‌గా నిర్మించే మా నూత‌న భ‌వ‌నంతోపాటు ఇత‌ర ప‌నుల్లో స‌హ‌కారాన్ని కోరారు. ఈ స‌మావేశం అనంత‌రం మోహ‌న్ బాబు మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ఓట‌మికి ప్ర‌చారం చేసినా...ఆయ‌న అదేమీ మ‌న‌సులో పెట్టుకోకుండా మంచు విష్ణుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌న్నారు. బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్య‌క్తి అని ఆయ‌న్ను క‌ల‌వ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లో చిరంజీవిని కూడా క‌ల‌వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే బాలకృష్ణతోపాటు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, కోట శ్రీనివాస‌రావు వంటి వారిని క‌లిశాన‌ని..పెద్ద‌ల ఆశీర్వాదంతో ముందుకు సాగుతామ‌న్నారు. ఈ నెల 16న ఎన్నికల అధికారి తన ప్యానల్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఇక రాజీనామాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విష్ణు పేర్కొన్నారు. ఎన్నిక‌ల అనంత‌రం కూడా మాలో రాజ‌కీయాలు గ‌రం గ‌రంగా సాగుతున్న తెలిసిందే.

ఈ ఎన్నిక‌ల్లో ప్రకాష్ రాజ్ ప్యాన‌ల్ త‌ర‌పున గెలిచిన వారంతా కూడా రాజీనామా చేసి బ‌య‌ట ఉండి ప్ర‌శ్నిస్తామ‌ని..త‌మ‌కు ఓటు వేసిన స‌భ్యుల‌కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌ని విష్ణు తొలిసారి ఈసీలో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఓ వైపు చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు కూడా తాజాగా మాట్లాడుతూ చిరంజీవి త‌న ద‌గ్గ‌రకు సాయం కోసం వ‌చ్చేవారికి చేత‌నైనంత సాయం చేశారే త‌ప్ప‌..ఆయ‌న ఎప్పుడూ పెద‌రాయుడిగా కూర్చుని తీర్పులు ఇవ్వాల‌ని చూడ‌లేద‌న్నారు. తాను మాత్రం మాలో కొన‌సాగ‌బోన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. విశేషం ఏమిటంటే ప్రెసిడెంట్ గా పోటీచేసిన ప్ర‌కాష్ రాజ్ మాత్రం బ‌య‌ట రాష్ట్రాల వారు పోటీకి అన‌ర్హులు అని బైలాస్ లో మార్పులు చేయ‌క‌పోతే మాత్రం త‌న రాజీనామాను ఉప‌సంహ‌రించుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటుండంతో ఈ వ్య‌వ‌హారం హాట్ హాట్ గా మారుతోంది.

Next Story
Share it