ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు మృతి
టాలీవుడ్ కు చెందిన యువ నిర్మాత, ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరు కింద పలు చిత్రాలు నిర్మించారు. మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.
ఎంతోకాలంగా ఎన్టీఆర్‌కు మహేశ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన '118, మిస్ ఇండియా, తిమ్మరుసు' వంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగా మారారు. మహేష్ మరణంపై ఎన్టీఆర్ స్పందించారు. ఈ వార్త విన్న తర్వాత షాక్ కు గురయ్యానని, తనకు మాటలు రావటంలేదని..ఇది ఏ మాత్రం నమ్మలేని విషయమని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. మహేష్ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ తన సానుభూతి తెలిపారు.