ఆన్ లైన్ టిక్కెట్ల విధానం మంచిదే
ఏపీ ప్రభుత్వం తీసుకురాదలచిన ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విధానాన్ని తాను సమర్ధిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన ప్రెసిడెంట్ మంచు విష్ణు తెలిపారు. దీని వల్ల అందరికీ స్పష్టత ఉంటుందని..అయితే ఇది ఇంకా తుది రూపుతీసుకోలేదన్నారు. మంచు విష్ణు తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ లో మీడియాతో మాట్లాడారు. దత్తాత్రేయ నిర్వహించిన అలయ్..బలయ్ కార్యక్రమంలో తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు తెలిపారు. అయితే వేదిక ఎక్కటానికే ముందే తాము మాట్లాడుకున్నామని..ఆ వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. భారత ఉపరాష్ట్రపతి ఉన్నవేదికపై తాము జోకులు వేసుకుంటూ కూర్చోవటం సాధ్యంకాదని..పక్కనేపక్కనే కూర్చుని మాట్లాడుకోలేదని మీడియా చిలువలపలువలు చేస్తుందన్నారు. మోహన్ బాబుతో చిరంజీవి మాట్లాడిన విషయం కరెక్టేనని..అయితే ఆ వివరాలు ఏమిటో తనకు తెలియదన్నారు. మాకు సంబంధించి చాలా విషయాల్లో బై లాస్ మార్చాలనుకుంటున్నట్లు తెలిపాయి. అంతకు ముందు దేశంలోని పలు పరిశ్రమల్లో ఉన్న బైలాస్ అన్నీ అధ్యయనం చేసి..తర్వాత వాటిని పరిశ్రమ పెద్దల ముందు పెట్టి..వారి ఆమోదంతో జనరల్ బాడీలో పెడతామన్నారు.
అయితే ఇతర రాష్ట్రాల వారు పోటీకి అనర్హులు అనే బైలాస్ తీసుకువచ్చే ఆలోచన తమకు లేదని..అసలు ఈ విషయం ప్రకాష్ రాజ్ కు ఎవరు చెప్పారో తెలియదన్నారు. ఎవరంటే వాళ్లు 'మా' సభ్యులు కాకూడదనేదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం 'మా' సభ్యుల హక్కని విష్ణు చెప్పారు. ప్రకాశ్‌రాజ్, నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారని, అయితే వారి రాజీనామాను ఆమోదించలేదన్నారు. త్వరలోనే దీనిపై ప్రకాశ్ రాజ్‌కు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తానని మంచు విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో తమ ప్యానల్ గెలిచిందని..నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ ను ఉద్దేశించి అన్నారు.