పరిశ్రమ ఏ ఒక్కరిది కాదు..మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
జగన్ తో చిరంజీవి భేటీ వ్యక్తిగత సమావేశం
పరిశ్రమ ఏ ఒక్కరిది కాదు.. అందరిదీ అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తో చిరంజీవి భేటీ వ్యక్తిగతం అని..వ్యక్తిగత సమావేశాలను పరిశ్రమ సమావేశం అనటం సరికాదన్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే తరహాలో స్పందించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ భోజనానికి పిలిస్తే చిరంజీవి వెళ్ళారని..వాళ్లిద్దరూ ఏదో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్ ధరల విషయంలో పరిశ్రమ అంతా ఒకే కంఠంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెండు ప్రభుత్వాలతో జరిగే ప్రాసెస్ ను ఎవరో స్వలాభం కోసం వాడుకుని పక్కదారి పట్టించకూడదని అన్నారు.
రెండు ప్రభుత్వాలు పరిశ్రమను సంతోషంగా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. సినిమా బిడ్డగా..పరిశ్రమలో పుట్టిన వ్యక్తిగా అందరితో కలసి పనిచేస్తామని..వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా కూడా చెప్పనన్నారు. అది కరెక్ట్ కాదన్నారు. తెలంగాణాలో సినిమా టిక్కెట్ ధరలు పెంచినా..ఏపీలో తగ్గించినా కొంత మంది కోర్టుకెళ్ళారని తెలిపారు. చిరంజీవి ఏర్పాటు చేయనున్న సమావేశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..ఆయన లెజెండరీ యాక్టర్ అని...చిరంజీవి, మోహన్ బాబు, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ లు అందరూ కలసి మాట్లాడితే మంచిదే అన్నారు.