'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
ఆగస్టు ఒకటి నుంచి సినిమాలు ఆపేస్తామని నిర్మాతల సంఘం ప్రకటించింది. దీంతో కొంత మంది విభేదించారు అయినా పెద్దల మాటే చెల్లుబాటు అవుతోంది కాబట్టి..అదే ముందుకు సాగుతుంది. షూటింగ్ లు ఆపేసే నిర్ణయం తీసుకోవటంలో కీలకపాత్రదారిగా ఉన్నదిల్ రాజు మాత్రం చెప్పిన దానికి భిన్నంగా ఆయన సినిమా షూటింగ్ లు మాత్రం చేసుకుంటున్నారు. అదేమంటే అది తెలుగు సినిమా కాదు అన్న విచిత్రవాదన తెరపైకి తెస్తున్నారు. ఇది అంతా ఒకెత్తు అయితే పరిశ్రమలో ఇంత జరుగుతున్నా కూడా అత్యంత కీలకమైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎందుకు మౌనంగా ఉంది. సినిమా షూటింగ్ లు ఆగిపోతే నష్టపోయేది కళాకారులే కదా. కోట్లాది రూపాయలు పారితోషికంగా తీసుకునే హీరోల సంగతి ఓకే. వాళ్లకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ ఇతర నటీ, నటుల సంగతి ఏమిటి?. అసలు షూటింగ్ లు ఎన్ని రోజులు ఆపుతారు..ఇందుకు పరిశ్రమకు కీలకం అయిన నటీ, నటులకూ..వీరి కీలక సంఘం అయిన 'మా' కు ఓ మాటమాత్రంగా చెప్పిన దాఖలాలు లేవని పరిశ్రమ వర్గాల టాక్. మా కూడా ఈ విషయంలో ఇప్పటివరకూ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. నేరుగా సంబంధం లేని టిక్కెట్ రేట్ల పెంపు వ్యవహారంలో మాత్రం ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ తిరిగారు కొంత మంది హీరోలు. కానీ షూటింగ్ లు ఆగిపోతే..చిన్న నటుల పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు.
మా ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు కూడా నిర్మాతే. అంతే కాదు..మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఓ నిర్మాణ సంస్థ ఉంది. మహేష్ బాబు కూడా నిర్మాతే. ఎన్టీఆర్ ఫ్యామిలికీ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఉంది. నాగార్జునదీ అదే పరిస్థితి. ఇలా హీరోలే నిర్మాతలు..హీరోలే థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఇలా చాలా మంది సినిమాల్లోనే కాదు...పరిశ్రమలో కూడా రక రకాల పాత్రలు పోషిస్తున్నారు. కానీ షూటింగ్ లు ఆపేస్తామంటే మాత్రం అటు టాప్ హీరోలు కానీ..ఇటు మా కూడా మ్యూట్ లో ఉండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు..అనధికారిక టాలీవుడ్ పెద్దగా ఉన్న చిరంజీవి కూడా ఈ విషయంలో పెద్దగా ఎక్కడా జోక్యం చేసుకుంటున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఆర్ధిక పుష్టి ఉన్న కొంత మంది నిర్మాతలే ఇప్పుడు షో అంతా నడిపిస్తున్నారని..మిగిలిన వారంతా వారికి ఓకే చెప్పే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నిర్మాతలు.