పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నా
ప్రతిష్టాత్మకంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష్ (మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్ ప్యానల్ సోమవారం నాడు నామినేషన్లు వేసింది. పవన్ కళ్యాణ్ మా సభ్యుడే అయినా ఆయన ఓ రాజకీయ నాయకుడు అని..దేశం కోసం పోరాడుతున్నాడు అని నామినేషన్ల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నట్లు తెలిపారు. మా ఎన్నికలకు సంబంధించి ప్రతి విషయంలో తాము ఓ అడుగు ముందే ఉన్నామన్నారు. ఇవి ఎన్నికలు కాదు..పోటీ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ' మా ప్యానల్ సభ్యులందరం నామినేషన్లు వేశాం. 900 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ ఇది. అభివృద్ధి చేయడానికి మేము పోటీ చేస్తున్నాం. రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలీదు. ఇది రాజకీయ ఎలక్షన్స్ కాదు. ఇది కేవలం సినిమా ఎలక్షన్స్.' అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ' పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం అర్థం రెండు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సింగిల్ ఫ్యామిలీ. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరిస్తే మంచిది. హెల్తీవే అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ తో ఎన్నికలు జరగాలి. నాపై కొన్ని విమర్శలు వచ్చాయి, అవి నన్ను బాధించాయి.. కానీ నేను 'మా' అభివృద్ధి కోసం పని చేశాను గెలిచిన, ఓడిన అందరూ మా కోసమే పని చేస్తారు.. అందరూ సినిమాల్లోనే చేస్తారు. అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా అభివృద్ధి కోసం ప్రకాష్ రాజ్ గారు గ్రౌండ్ వర్క్ చేసి ప్లాన్ రెడీ చేశారు. ప్రకాష్ రాజ్ గారి అలోచనలు బాగున్నాయి కాబట్టి మేము వారికి సపోర్ట్ చేస్తున్నాం' అని తెలిపారు. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉందనటానికి తమ దగ్గర ఆధారాలు ఏమీ లేదని..చిరంజీవి మంచు విష్ణు కూడా మద్దతు ఇవ్వొచ్చని అన్నారు.