Telugu Gateway
Cinema

మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు విజ‌యం

మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు విజ‌యం
X

సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అత్యంత హోరాహోరీగా సాగిన మా ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ పై మంచు విష్ణు విజ‌యం సాధించారు. మా కార్య‌వ‌ర్గంలో కీలక పోస్టులు అన్నీ కూడా మంచు విష్ణు ప్యాన‌లే ద‌క్కించుకుంది. ముందు నుంచి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా మంచు విష్ణు ప్యాన‌ల్ విజ‌య‌తీరాల‌ను అందుకుంది. మంచు విష్ణుతోపాటు అత్యంత కీల‌క‌మైన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి ర‌ఘుబాబు, ట్రెజ‌ర‌ర్ గా శివబాలాజీ విజ‌యం సాధించారు. మంచు విష్ణు ప్యాన‌ల్ విజ‌యం సాధించ‌టంతో కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద ఒక్క‌సారిగా కోలాహ‌లం ప్రారంభం అయింది. గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని రీతిలో ఈ సారి మా ఎన్నిక‌లు సాగాయి. అందుకే ఓటింగ్ శాతం కూడా పెరిగింది.

వాస్త‌వం మాట్లాడుకోవాలంటే విష్ణు ప్యాన‌ల్ లో కంటే ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లోనే పాపుల‌ర్ న‌టులు ఎక్కువ మంది ఉన్నారు. అయినా స‌రే మంచు విష్ణుతోపాటు మోహ‌న్ బాబు అనుస‌రించిన వ్యూహాం, సీనియ‌ర్ల‌ను క‌లిసి త‌మ ప్యాన‌ల్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కోర‌టం త‌దిత‌ర అంశాలు వీరికి క‌లిసొచ్చాయి. మ‌రో కీల‌క అంశం మా మాజీ ప్రెసిడెంట్ న‌రేష్ కూడా మంచు విష్ణుకు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇస్తూ వీరి గెలుపు కోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేశారు. అంతే కాకుండా మంచు విష్ణు ఓ భారీ మ్యానిఫెస్టోతో ముందుకు వ‌చ్చి త‌మ‌ను గెలిపిస్తే మా స‌భ్యులంద‌రికీ మేలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.. మంచు విష్ణు ప్యాన‌ల్ కీల‌క స్థానాలు ద‌క్కించుకోవ‌టానికి ఇవ‌న్నీ కూడా కీల‌క అంశాలుగా మారాయి.

Next Story
Share it