ప్రదీప్ రంగనాథ్ కు మళ్ళీ హిట్ దక్కిందా?!

రోబో సినిమాలో రజనీకాంత్ ఇనుములో హృదయం మొలిచినే అంటూ పాడుకుంటాడు. ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ శివన్ యాప్ లో ప్రేమ లెక్కలు ...రేటింగ్ లు పుట్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ తో ఆయన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ని తెరకెక్కించాడు. ఇందులో ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తే హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాప్ అధినేతగా ఎస్ జె సూర్య కనిపిస్తారు. ప్రేమ అంటే భావోద్వేగాలతో కూడిన వ్యవహారం. అలాంటి లవ్ ను ఒక మెషిన్ లాంటి యాప్ డిసైడ్ చేస్తే ఎదురయ్యే సమస్యలు ఏంటి...అందులో ఏ మాత్రం అయినా అసలు నిజం ఉంటుందా అన్న అంశంపైనే ఈ మూవీ తెరకెక్కింది. హీరో ప్రదీప్ రంగనాథన్ గత సినిమా లు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్స్ గా నిలవటంతో ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యువ హీరో తెలుగు లో కూడా మంచి మార్కెట్ సాదించుకున్నాడు.
పలు వాయిదాలు పడిన అనంతరం ఈ లిక్ మూవీ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ. 2040 నుంచి ఈ మూవీలో కథ మొదలవుతుంది. ఈ మూవీ కథ ఏంటి అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాప్ లవ్ రేటింగ్ ఇవ్వటంతో పాటు ఎవరు...ఎవరికీ సెట్ అవుతారు వంటి విషయాలను నిర్దారిస్తుంది. సరిగ్గా హీరో, హీరోయిన్ ల తొలి పరిచయం కూడా ఈ యాప్ కంపెనీ ముందే మొదలవుతుంది. తర్వాత అది ప్రేమగా మారుతుంది. అయితే అందరిలాగే నిత్యం మొబైల్ తో కాలక్షేపం చేసే హీరోయిన్ తమ లవ్ రేటింగ్ కోసం ఎల్ఐకె యాప్ లో చెక్ చేస్తే కేవలం మూడు అంటే మూడు పాయింట్స్ వస్తాయి. దీంతో హీరో కు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ యాప్ పై హీరో చేసిన పోరాటం ఏంటి...వీళ్ళ లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తిరిగింది అన్నదే మూవీ. కాన్సెప్ట్ పరంగా..స్టోరీ లైన్ పరంగా ఇప్పటి వరకు ఎవరూ ఎవరూ టచ్ చేయని లైనే ఇది. కానీ ఈ కొత్త లైన్ ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విగ్నేష్ శివన్ విఫలం అయ్యాడు అనే చెప్పాలి.
ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా బోర్ గా...స్లో గా సాగుతుంది. ఎప్పుడైతే యాప్ రేటింగ్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రేమకు బ్రేక్ అప్ అవుతుందో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచే కాస్త సినిమా ఊపు అందుకుంటుంది. హీరో ప్రదీప్ రంగనాథ్ ఈ మూవీలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ కృతి శెట్టి కి కూడా మంచి రోల్ దక్కింది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అధినేతగా ఎస్ జె సూర్య ఆకట్టుకున్నాడు...తనదైన ప్రత్యేకత చూపించాడు. సినిమాలో కాస్త రిలీఫ్ అంటే యోగి బాబు కామెడీనే అని చెప్పాలి. సినిమా నిర్మాణం విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడా రాజీపడలేదు. కొత్త కాన్సెప్ట్..స్టోరీ లైన్ తీసుకుని ఆసక్తికరమైన టైటిల్ తో ముందుకు వచ్చినా కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి.



