Telugu Gateway
Cinema

ల‌తా మంగేష్క‌ర్ అస్త‌మ‌యం

ల‌తా మంగేష్క‌ర్ అస్త‌మ‌యం
X

ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 92 సంవ‌త్స‌రాలు. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా బారిన ప‌డి..కోలుకుని..అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో ఆమె తుది శ్వాస విడిచారు. ముంబ‌య్ లోని బ్రీచ్ కాండీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూనే ఆదివారం ఉద‌యం 8.12 గంట‌ల‌కు ల‌తా మంగేష్క‌ర్ మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 8న కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమె కోలుకుంటున్న‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది. 1942లో గాయనిగా కెరీర్ ప్రారంభించిన ల‌తా మంగేష్క‌ర్ అన్ని భార‌తీయ భాష‌ల్లో పాట‌లు పాడి రికార్డు నెల‌కొల్పారు. అయితే ఆమె పాడిన వాటిలో ఎక్కువ పాటలు హిందీవే. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న ఆమె.. ప‌లు భాషల్లో క‌లుపుకుని 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగులో 1955 లో ఏఎన్నార్‌ 'సంతానం' కోసం నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు.ల‌తా మంగేష్క‌ర్ అస‌లు పేరు హేమ‌. ఆమె పుట్టింది ఇండోర్ లో. ఐద‌వ ఏట నుంచే ఆమె పాట‌లు పాడ‌టం ప్రారంభించారంటే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అయితే ఆమె టాలెంట్ ను గుర్తించి కూడా తండ్రి దీనానాథ్ మంగేష్క‌ర్ . రాజ్య‌స‌భ ఎంపీగా ప‌నిచేసిన ఆమె..త‌న ప‌ద‌వి కాలం స‌మ‌యంలో ఒక్క రూపాయి కూడా వేత‌నం తీసుకోకుండా ఆద‌ర్శంగా నిలిచారు.

ల‌తా మంగేష్క‌ర్ పాట‌లు పాడడం ప్రారంభించిన తొలి ద‌శ‌లో పలువురు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులు ఆమె వాయిస్ చాలా సన్నగా ఉన్నదంటూ ఆమెకు సినిమాల్లో పాడేందుకు అవకాశం కల్పించలేదు. 1942 సంవత్సరంలో తన పదమూడేళ్ల చిన్న వయస్సులోనే లత తన తండ్రిని కోల్పోయింది. దీంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. ఈ నేపధ్యంలోనే వారి కుటుంబం పూణె నుండి ముంబైకి మారింది. లతకు సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేదు. అయితే కుటుంబ ఆర్థిక బాధ్యతను భుజాలమీదకు ఎత్తుకుని సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. 1942లో లతకు తొలిసారిగా మంగళగౌర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. 1942-1948 మధ్య కాలంటో లత దాదాపు ఎనిమిది హిందీ , మరాఠీ చిత్రాలలో నటించింది. లత 1942లో మరాఠీ చిత్రం 'కితీ హాసిల్' (1942)లో ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసింది. అయితే ఆ పాట తర్వాత సినిమా నుండి తొలగించారు. మొత్తం మీద ఏడు ద‌శాబ్దాల పాటు ఆమె గాయ‌నిగా భార‌తీయ సంగీతాభిమానుల‌ను ఆల‌రించారు..

Next Story
Share it