సూపర్ కాంబినేషన్ సక్సెస్ అయిందా?!

దర్శకుడు శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలే ఆయనకు ఆ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. 2021 విడుదల అయిన నాగ చైతన్య, సాయి పల్లవి లతో తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వచించిన కుబేర సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. ఇందులో సీనియర్ హీరో నాగార్జున తో పాటు ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే దేశంలోని వనరులను అధికారంలో ఉన్న నేతలు, పారిశ్రామికవేత్తలు కలిసి ఎలా దోచుకుంటారు అన్నదే ఈ మూవీ స్టోరీ లైన్. ఇలాంటి స్టోరీ లు గతంలో చాలానే వచ్చినా...దేశంలోనే ఒక నంబర్ వన్ సంపన్నుడు రాజకీయ నేతలకు బినామీ మార్గంలోకి డబ్బులు పంపటానికి బిచ్చగాళ్లను ఎలా వాడుకున్నాడు.
ఇలా వాళ్ళు ఎంచుకున్న బిచ్చగాళ్ళలో ఒకడు తప్పించుకోవటంతో వచ్చిన సమస్యలతో దర్శకుడు సినిమా ను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే నంబర్ వన్ పారిశ్రామికవేత్తతో ఒక బిచ్చగాడు కనిపించకుండా ఎలా పోరాడాడు అన్నదే ఈ సినిమా. బిచ్చగాడు రోల్ లో హీరో ధనుష్ దుమ్మురేపాడు అనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు రకరకాల వేరియేషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఒక అధికారి నిజాయతీగా ఉండటం ఎంత కష్టమో సిబిఐ ఆఫీసర్ రోల్ పోషించిన నాగార్జున పాత్ర ద్వారా చూపించాడు దర్శకుడు. ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కనిపెట్టిన చమురు నిల్వలను దక్కించుకునేందుకు దేశంలోని బడా పారిశ్రామిక వేత్త ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరికి కలిపి లక్ష కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వటానికి సిద్ధం అవుతాడు. ఈ లావాదేవీ పూర్తి చేయటానికే సిబిఐ ఆఫీసర్ గా సస్పెండ్ అయి జైలు లో ఉన్న నాగార్జున సాయం తీసుకుంటారు. పారిశ్రామిక వేత్త పాత్ర పోషించిన జిమ్ సర్బ్ దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనే చెప్పాలి.
ఇక హీరోయిన్ రష్మిక మందన్న పాత్ర విషయానికి వస్తే ఇందులో ఆమె చేసింది గత సినిమాలకు చాలా భిన్నమైన పాత్రే అని చెప్పాలి. తన ప్రేమికుడితో లేచిపోవటానికి వచ్చి రైల్వే స్టేషన్ లో ధనుష్ తో ఆమె ను కనెక్ట్ చేసిన విధానం కూడా వెరైటీ గా ఉంటుంది అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. అక్కడక్కడా డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో కథ చెప్పిన విధానంగా వెరైటీ గా ఉన్నా కూడా మూవీ నడిచే కొద్దీ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. సోషల్, ఎమోషనల్ డ్రామాగా వచ్చిన కుబేర తో దర్శకుడు మరో హిట్ దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పీ. రామ్మోహన్ రావు లు నిర్మాతలు.
రేటింగ్: 3 /5