అమెజాన్ ప్రైమ్ లో 'కెజీఎఫ్2'
సంచలన విజయం నమోదు చేసిన కెజీఎఫ్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను వెంటనే చూసేయవచ్చు.. అయితే ఈ సినిమా చూడాలంటే సబ్ స్క్రైబర్లు ఏకంగా 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా యశ్ యాక్షన్, ఎలివేషన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1200 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే. అంతే కాదు..దీని కంటే ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించిన రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1100 కోట్ల రూపాయలు వసూళ్ళు సాధించటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లోనూ రికార్డు వసూళ్ళు సాధించటంతో ఈ అంశంపై పలు పరిశ్రమల హీరోల మధ్య వాగ్వాదాలు సాగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్ 2లు భారీ వసూళ్లు సాధించగా..ఓటీటీలోనూ ఈ రెండు సినిమాలు డబ్బుల వసూలు చేయాలని నిర్ణయించటం చర్చనీయాంశంగా మారింది. మే 20 నుంచి ఆర్ఆర్ఆర్ జీ5లో అందుబాటులో ఉండబోతుంది. కెజీఎఫ్ 2 ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. డబ్బులు చెల్లించి వెంటనే చూసేయవచ్చు అన్నమాట.