కంగనా రనౌత్ కు అత్యాచార బెదిరింపులు
బెదిరింపులు వెర్రితలలు వేస్తున్నాయి. కొంత మంది సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. అభిప్రాయ బేధాలు వేరు. కానీ తమకు నచ్చని రీతిలో ఎవరైనా స్పందిస్తే వారిపై ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేయటానికి అయినా వెనకాడటం లేదు. ఈ మధ్య కాలంలో ఇదీ మరు ఎక్కువైంది. ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800లో నటించేందుకు సిద్ధపడిన తమిళ హీరో విజయసేతుపతి కుమార్తెపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పడు తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంతు. ఆమెకు ఒరిస్సాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచారం బెదిరింపు వచ్చింది. నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టారు. తన ఖాతా హ్యాక్ చేశారని సదరు న్యాయవాది అనంతరం ఓ పోస్ట్ చేశాడు. 'ఈ రోజు నా ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. అందులో నుంచి అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు చేశారు.
స్త్రీలను, సమాజాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు నావి కాదు. వీటిని చూసి నేను కూడా చాలా షాక్ అయ్యాను. వీటి వల్ల ఎ వరి మనోభావాలు అయిన దెబ్బతింటే నన్ను క్షమించండి. అని కోరారు. అనంతరం తన ఫేస్‌బుక్ ఖాతాను తొలగించారు. తన స్నేహితుల ద్వారా ఈ వ్యాఖ్యలు తెలుసుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ తన స్వస్థలమైన మనాలిలో సోదరుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మహారాష్ట్రలోని శివసేన సర్కారుతో వివాదాలు పెట్టుకుంటూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముంబయ్ లోని ఆమె భవనాన్ని నిబంధనలను ఉల్లంఘించి కట్టారని బీఎంసీ కూల్చివేసిన సంగతి తెలిసిందే.ఆమె దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.