కెజీఎఫ్ 2 బీట్ చేసిన కల్కి మూవీ
కల్కి సినిమా తో ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన దర్శకుల్లో ఒకరిగా నాగ్ అశ్విన్ నిలిచారు అనే చెప్పాలి. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా వసూళ్ల విషయంలో కెజీఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి మూడవ అతి పెద్ద ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఒక్క భారత్ లోనే ఈ సినిమా ఫస్ట్ డే 115 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 95 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ఇండియాలో గ్రాస్ వసూళ్లు 115 కోట్ల రూపాయలుగా ఉంటే..ఓవర్సీస్ లో ఈ మొత్తం 65 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం కలుపుకుని తొలిరోజు ఈ సినిమా 180 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు అయింది. కల్కి 2898 సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అయింది. మొత్తం మీద అత్యధిక వసూళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి అని చెప్పాలి. తొలి రోజు వచ్చిన 95 కోట్ల రూపాయల నెట్ లో ...దగ్గర దగ్గర 65 కోట్ల రూపాయలు తెలుగు మార్కెట్ నుంచే దక్కాయి. 24 కోట్ల రూపాయలతో హిందీ మార్కెట్ సెకండ్ ప్లేస్ లో ఉంది. కేజీఎఫ్ 2 వసూళ్లను అధిగమించటం ద్వారా కల్కి మూవీ దేశంలోనే మూడవ అతి పెద్ద గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది.
కేజీఎఫ్ 2 తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 159 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు దేశ సినిమా చరిత్రలో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు రెండు కూడా రాజమౌళి తెరకెక్కించిన మూవీస్ కావటం విశేషం. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించగా..బాహుబలి 2 మాత్రం 217 కోట్ల రూపాయలు సాధించింది. కల్కి సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో ప్రీ రిలీజ్ సేల్స్ విషయంలో కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. శుక్రవారంతో పాటు వీకెండ్స్ కు కూడా కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూళ్లు కొత్త రికార్డు లు రికార్డు చేయటం ఖాయంగా భావిస్తున్నారు. కల్కి సినిమా ను 600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెరకెక్కించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ప్రభాస్ తో పాటు కీలక నటులు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పాడుకొనే లు నటించిన విషయం తెలిసిందే.