వేడుకగా కాజల్ అగర్వాల్ పెళ్లి
కాజల్ అగర్వాల్ పెళ్లి శుక్రవారం నాడు ముంబయ్ లో ఘనంగా జరిగింది. కోవిడ్ 19 పరిమితుల మధ్య రెండు కుటుంబాలకు చెందిన బంధువులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం సాగింది. పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ ఏడడుగులు వేశారు. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ ఇంకా ఆమె పలు అవకాశాలను దక్కించుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే. కాజల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
పెళ్లికి ముందు ఈ జంట ఇంట సంగీత్, హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిషా అగర్వాల్, గౌతమ్‌తో పాటు మరి కొందరు స్నేహితులతో కలిసి కాజల్ ఈ వేడుకలో సందడి చేశారు. వివాహం అనంతరం కాజల్, గౌతమ్ కిచ్లులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఇందుకు గాను ఈ జంట ఇప్పటికే ముంబయ్ లో కొత్త ఇంటిని సిద్ధం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే కాక ఎనీ సజేషన్స్ అంటూ అభిమానులను సలహా కోరిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం గౌతమ్ కిచ్లు తమ కొత్త ఇంటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.