విజయ్ కొత్త సినిమా 'జనగణమన'
లైగర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. పూరీ జగన్నాథ్, హీరో విజయ్ లు మంగళవారం నాడు కొత్త సినిమాను ప్రకటించారు. లైగర్ విడుదలకు ముందే చిత్ర యూనిట్ నుంచి కొత్త ప్రకటన వెలువడటం విశేషం. జనగణమన (JGM) పేరుతో సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయటంతోపాటు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా ప్రకటించారు. ఈ జెజీఎం వచ్చే ఏడాది ఆగస్టు 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. శ్రీకర స్టూడియోస్ పేరుతో వంశీ పైడిపల్లి, పూరీ కనెక్ట్స్ తో ఛార్మి కౌర్ లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమాలో నటించే హీరోయిన్ తోపాటు ఇతర పాత్రల విషయంలోనే త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది. వాస్తవానికి పూరీ జగన్నాథ్ జనగణమన సినిమాను మహేష్ బాబుతో చేయాల్సి ఉంది. చాలా కాలం క్రితమే దీనిపై ప్రకటన కూడా వెలువడింది. కారణాలేంటో కానీ మహేష్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో పూరీ తాను అనుకున్న ఈ సినిమాను ఇప్పుడు పట్టాలెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ్, అనన్యపాండేలు నటించిన లైగర్ సినిమా ఈ ఆగస్టు 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ప్రత్యేక పాత్రలో నటించారు. బాక్సింగ్ నేపథ్యంతో లైగర్ సినిమాను తెరకెక్కించారు.