దుమ్మురేపుతున్న జవాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరస విజయాలతో దూసుకెళుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు ప్రకటించారు. ఇప్పుడు జవాన్ సినిమా తో కూడా షారుఖ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డు లు నమోదు చేసింది. భారత్ లో అన్ని భాషల్లో కలుపుకుని ఈ సినిమా 75 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది.
ఒక్క హిందీ లోనే 65 కోట్ల రూపాయలు రాగా, తమిళం లో కూడా ఐదు కోట్ల రూపాయల నికర వసూళ్లు , తెలుగు లోనూ ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షా రుఖ్ ఖాన్ కు జోడిగా నయనతార, దీపికా పాడుకొనే లు నటించారు. విజయ్ సేతుపతి కూడా ఇందులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచి కూడా జవాన్ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్టులు చెపుతున్న మాట.