ఇలాగేనా సిరివెన్నెలకు నివాళి!
సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఓ లెజెండరీ క్యారెక్టర్. తెలుగు సినీ సాహిత్యంలో దిగ్గజం. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారనే వార్త తెలిసినప్పటి నుంచి పరిశ్రమ వర్గాలతోపాటు సామాన్య ప్రేక్షకులు కూడా ద్రిగ్భాంతిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ తరుణంలో పరిశ్రమకు చెందిన ఇంతటి మహోన్నతమైన వ్యక్తి చనిపోతే ఎలా స్పందించాలి. ఈ వార్త వచ్చిన తర్వాత ఒక్క పూట అయినా పరిశ్రమలోని ప్రముఖులు తమ కార్యక్రమాలకు విరామం ప్రకటించలేరా?. సరిగ్గా సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోయారనే వార్త నాలుగు గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. అయినా సరే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి ఓ ఐటెం సాంగ్ అప్ డేట్ ను చిత్ర యూనిట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. భారీ సెట్ లో సమంత ఐటెం సాంగ్ చిత్రీకరణ చేసినట్లు..సాంగ్ ఆఫ్ ద ఇయర్ కు రెడీగా ఉండాలంటూ పోస్ట్ పెట్టారు.
అదే ఈ ఫోటో. దీంతోపాటు పరిశ్రమలోని ప్రముఖులకు చెందిన పలు వార్తలు, అప్ డేట్స్ వచ్చాయి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత కూడా తాము పాల్గొన్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై అందరూ విస్మయానికి గురవుతున్నారు. పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి చనిపోయిన సమయంలో ఆయన సముచిత గౌరవం ఇచ్చేలా కనీసం ఒక పూట అయినా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటే బాగుంటుందని..అలా కాకుండా ఏది ఏమైనా మా పని పదే..మా ప్రచారం మాదే అన్నట్లు వ్యవహరించటం వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతామని ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. కీలకమైన డైరక్టర్ వంటి స్థానాల్లో ఉన్న వారు ఎవరితోనే చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదని..స్వీయ క్రమశిక్షణ అనేది అవసరం అని వ్యాఖ్యానించారు. నిజంగా సిరివెన్నెల మరణ వార్త తెలియక ఇలాంటి పోస్ట్ లు పెట్టినా తర్వాత అయినా దిద్దుకునే పనులు చేయకపోవటం మరింత దారుణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.