చర్చలు సంతృప్తికరం..వర్మ
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మంత్రితో భేటీ అయి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తాను ఎవరి తరపున ఇక్కడకు రాలేదని..ఓ నిర్మాతగా తన అభిప్రాయాలను చెప్పానని..మంత్రి పేర్ని నాని తనకు కొన్ని విషయాలు చెప్పారన్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణలను టార్గెట్ చేసుకుని ఏపీ సర్కారు నిర్ణయాలు ఉంటాయని తాను భావించటం లేదన్నారు. సినిమా టిక్కెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదనే తన అభిప్రాయానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తక్కువ ధరలు ఉండటం వల్ల ఏపీలో పుష్ప వసూళ్ళు ఏపీలో తక్కువగా ఉన్నాయన్నారు. ఉత్తరాధి, తెలంగాణలో పోలిస్తే ఏపీలో తేడా స్పష్టంగా కన్పిస్తోందన్నారు. టికెట్ ధరల తగ్గింపుతో సినిమా రంగం దెబ్బతింటుందని ఆయన తెలిపారు.
సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో సినిమా క్వాలిటీపై కూడా ప్రభావం పడుతుందని వెల్లడించారు. పేర్ని నానితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వర్మ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...' ప్రధానంగా ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించాం. అందులో మొదటిది టిక్కెట్ రేట్ల తగ్గింపు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదు. టికెట్ రేట్లు తగ్గించడాన్నివ్యతిరేకించా. సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్నిఆయన దృష్టికి తీసుకొచ్చా. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మా సినీరంగానికి చెందిన వారిని కలిసి చర్చిస్తా. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. నా వాదన వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. నేను ఎలాంటి డిమాండ్లు ఆయన ఎదుట పెట్టలేదు. ఈ భేటీ ద్వారా వచ్చిన అభిప్రాయాలపై ఇద్దరం చర్చిస్తాం. తుది నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది.' అని తెలిపారు.