సుహాస్ కు హిట్ దక్కిందా?!

సుహాస్, శివాని నగరం జంటగా నటించిన సినిమా హే బలవంత్. వాస్తవానికి రిలీజ్ కు కొద్దిరోజుల ముందే ఈ సినిమా టైటిల్ హే భగవాన్ నుంచి హే బలవంత్ గా మారిన విషయం తెలిసిందే. సినిమా చూసిన తర్వాత ఎవరికైనా సెన్సార్ బోర్డు సరైన నిర్ణయమే తీసుకుంది అన్న ఫీలింగ్ కలగటం మాత్రం ఖాయం. గత సినిమాల విషయంలో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన సుహాస్ హే బలవంత్ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా..గురువారం రాత్రే పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేశారు. హీరో చిన్నప్పటి నుంచి తండ్రి బిజినెస్ టేకప్ చేయాలనే టార్గెట్ తోనే ఉంటాడు. చదువు కూడా ఒక డిగ్రీ ఉంటే చాలు...ఉద్యోగం కోసం అయితే బాగా చదవాలి కానీ తండ్రి బిజినెస్ చూసుకోవటానికి చదువులో టాప్ లో ఉండాల్సిన అవసరం లేదు అని స్కూల్ లో టీచర్ కే చెపుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని ఒక్క సారి అయినా తమ ఆఫీస్ కు తీసుకెళ్లామని అడుగుతూనే ఉంటాడు. కానీ ఎప్పటి కప్పుడు తండ్రి నరేష్ స్కిప్ చేస్తాడు. ఇలా అయితే లాభం లేదు అని కొడుకును గుంటూరు నుంచి హైదరాబాద్ కు పంపి చదివిస్తాడు. హైదరాబాద్ లో ఎంబీఏ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పటి లాగానే తండ్రి వ్యాపారం టేకోవర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు.
ఈ గ్యాప్ లో ఒక ఎన్ జీవో సాయంతో నడిచే పరిశ్రమలకు సలహాలు ఇస్తూ వాటిని లాభాల బాటలోకి తీసుకురావటనికి తన వంతు సాయం అందిస్తాడు హీరో. ఆ సమయంలోనే ఎన్ జీఓ నడిపే శివాని నగరం కు దగ్గర అవుతాడు. సడన్ గా తండ్రి ఒకసారి అనారోగ్యానికి గురి కావటంతో తండ్రి చేసే బిజినెస్ ఏంటో తెలుసుకుందామని ఆఫీస్ కు వెళ్లిన సుహాస్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత తన తండ్రి చేసే వ్యాపారం ఏంటో తెలియకుండా చేసేందుకు హీరో పడే పాట్లు సినిమాలో హై లైట్ గా నిలుస్తాయి. ఎలాగైనా దాన్ని వదిలించుకుందామని హీరో చేసే ప్రయత్నాలు..అందులో ఎదురయ్యే సవాళ్లు ఏంటి అన్నదే హే బలవంత్ మూవీ. కథకు కీలకం అయిన నరేష్ వ్యాపారం చుట్టూ వచ్చే కామెడీ నే సినిమా ని నిలబెట్టింది. ఒక వైపు ప్రేక్షకులను ఫుల్ గా నవ్విస్తూ..మరో వైపు క్లైమాక్స్ లో ఎమోషన్స్ ను కూడా దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు. హీరో సుహాస్ ఈ సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
సందర్భానికి అనుగుణంగా మంచి నటన కనపరిచాడు. సినిమాలో హై లైట్ అంటే నరేష్ నటనే అని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాయనే చెప్పాలి. సుదర్శన్ కు గత సినిమాలతో పోలిస్తే ఇందులో మంచి పాత్ర దక్కింది..ప్రేక్షకులను బాగా నవ్వించాడు కూడా. అజయ్ ఘోష్ ది సీరియస్ పాత్ర అయినా..ఆయన కొడుకు పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ రోల్ కూడా ఆకట్టుకుంటుంది. బాబూమోహన్, హర్షవర్ధన్ , అన్నపూర్ణ లు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. హీరోయిన్ శివాని నగరం ఈ సినిమాలో పదే పదే తమది సంప్రదాయ కుటుంభం అని చెపుతూ ఉండటం ఆ తర్వాత జరిగే పరిణామాలు సినిమాలో బాగా నవ్వులు పండించాయి. మొత్తం మీద హే బలవంత్ మూవీ తో సుహాస్ తిరిగి ట్రాక్ న పడినట్లే అని చెప్పొచ్చు. అయితే ఈ కామెడీ అందరికి నచ్చకపోవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కొంత ఇబ్బందికరమే.



