థియేటర్లే నాకిష్టం..అయినా నిర్ణయం వాళ్ళిష్టం
హీరో నాని నలిగిపోతున్నారు. ఆయన కొత్త సినిమా టక్ జగదీష్ విడుదల ఎలా చేయాలి?. ఎప్పుడు చేయాలి. నిర్మాతలు ఒత్తిడిలో ఉన్నారు. అనిశ్చితితో కూడిన ఈ వాతావరణంలో ఓటీటీలో విడుదల చేసి బయటపడదామని నిర్మాతల ఆలోచన. హీరో నాని మాత్రం థియేటర్లలోనే విడుదలకు మొగ్గుచూపుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారించేలా హీరో నాని బుధవారం నాడు తన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. టక్ జగదీష్ అత్యుత్తమైన సినిమా అని..వెండితెరపై దీన్ని చూడటమే బాగుంటుందని అన్నారు. తాను థియేటర్లలో సినిమా చూసే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు.
ఫస్ట్ డే..ఫస్ట్ డే హౌస్ ఫుల్ అయిన థియేటర్ లో సినిమా చూడటం ఓ మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు. విదేశాల్లో కూడా ఊహించని పరిస్థితులు ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకర ఆంక్షలు వంటి అంశాలతో సమస్య మరింత సంక్లిష్టంగా మారిందన్నారు. ఈ తరుణంలో నిర్మాతలు తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా తాను గౌరవిస్తానని తెలిపారు. టక్ జగదీష్ విడుదల విషయాన్నిషైన్ స్క్రీన్స్ తోపాటు ఇతర భాగస్వాముల ఇష్టానికే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు.