Telugu Gateway
Cinema

ఏపీ నిర్ణ‌యం క‌రెక్ట్ కాదు

ఏపీ నిర్ణ‌యం క‌రెక్ట్ కాదు
X

ఏపీ సర్కారు నిర్ణ‌యంపై హీరో నాని నోరువిప్పారు. టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రికాద‌న్నారు. టిక్కెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించి ఏపీ ప్రభుత్వంప్రేక్షకులను అవమానించింద‌ని విచిత్ర వ్యాఖ్య‌లు చేశారు. థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు. టికెట్ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంద‌న్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. తన పేరు ముందు నేచురల్ స్టార్ తీసేద్దాం అనుకుంటున్నాన‌ని తెలిపారు. నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా శుక్ర‌వారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న రేట్లు ఎగ్జిబిట‌ర్ల‌కు లాభ‌దాయ‌కం కాద‌ని చెప్ప‌టం వ‌ర‌కూ ఓకే కానీ..రేట్లు త‌గ్గించి ప్రేక్షకుల‌ను అవ‌మానించ‌టం ఎలా అవుతుందో నానికే తెలియాలి. ముఖ్యంగా బీ, సీ సెంట‌ర్ల‌లో రేట్లు ఏ మాత్రం గిట్టుబాటు కావ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదే అంశంపై చిరంజీవి ట్వీట్ చేసినా ఏపీ ప్ర‌భుత్వం ఈ అంశాన్ని లైట్ తీసుకుంది. మంత్రి పేర్ని నాని చిరంజీవి అభిప్రాయాల‌ను సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ‌తాన‌న్నారు కానీ జ‌రిగింది శూన్యం. కొంత మంది ఎగ్జిబిట‌ర్లు ఇదే అంశంపై కోర్టును ఆశ్ర‌యించినా స‌రే ఏపీ స‌ర్కారు మాత్రం ఆగ‌మేఘాల మీద దీనిపై అప్పీల్ కు వెళ్లి రేట్ల త‌గ్గింపున‌కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో మాత్రం పెద్ద సినిమాల విషయంలో తొలి వారం రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. పుష్ప విష‌యంలో కూడా అదే జ‌రిగింది. గ‌తంలో 200 రూపాయ‌లు ఉన్న టిక్కెట్ ధ‌ర ను ఏకంగా 250 రూపాయ‌ల‌కు పెంచారు.. కానీ ఏపీలో మాత్రం సీన్ రివ‌ర్స్ లో ఉంది.

Next Story
Share it