స్పెయిన్ లో మహేష్ బాబు మోకాలికి శస్త్రచికిత్స

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబుకు శస్త్రచికిత్స జరిగింది. గత కొంత కాలంగా మోకాలినొప్పితో బాధపడుతున్న ఆయన తాజాగా వైద్యుల సూచన మేరకు స్పెయిన్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. స్పెయిన్ నుంచి దుబాయ్ వచ్చి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. మోకాలికి శస్త్ర చికిత్స జరగటంతో ఆయనకు రెండు నెలల విశ్రాంతి తప్పనిసరి అని సమాచారం. ఈ సమయం అంతా ఆయన దుబాయ్ లోనే ఉంటారని చెబుతున్నారు.
విశ్రాంతి తర్వాత తాను నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటారు. .మహేష్ బాబుకు శస్త్రచికిత్స కారణంగానే సర్కారు వారి పాట సినిమా విడుదల తేదిని కూడా వాయిదా వేశారు. చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.