పవన్ ఫ్యాన్స్ లో జోష్ తెచ్చిన ట్రైలర్

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన హరి హర వీర మల్లు సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిన్న మొన్నటి వరకు తీవ్ర నిరాశలోనే ఉన్నారు. కానీ గురువారం నాడు విడుదల అయిన ట్రైలర్ తో పవన్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. గత కొంత కాలంగా సాగుతున్న నెగిటివ్ ప్రచారానికి ఈ ట్రైలర్ ఒకింత బ్రేక్ వేసింది అనే చెప్పొచ్చు. మొత్తంమీద హరి హర వీర మల్లు ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ నెల 24 న పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ . గురువారం నాడు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
అంతే కాదు అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డు లను కూడా ఇది తిరగరాయటం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని జోష్ తెచ్చిపెట్టింది. విడుదల అయిన 24 గంటల్లో పుష్ప 2 ట్రైలర్ కు 44 .67 మిలియన్ వ్యూస్ దక్కితే..ఇప్పుడు హరి హర వీర మల్లు కు 48 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్ర లో ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ ఇదే అని తెలిపింది. అన్ని భాషల్లో కలుపుకుని ఈ సినిమా 24 గంటల్లో మొత్తం 61 . 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు జోడి గా నిధి అగర్వాల్ నటిస్తోంది.