షాకింగ్ న్యూస్ చెప్పిన హంసానందిని

హంసానందిని. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. ఆమె సోమవారం ఉదయం షాకింగ్ న్యూస్ వెల్లడించారు. నిత్యం సోషల్ మీడియా యాక్టివ్ ఉండే ఆమె గత కొంత కాలంగా ఎలాంటి పోస్టింగ్ లు పెట్టకుండా దూరంగా ఉంటున్నారు. ఇదే అంశంపై ఆమెను అభిమానులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం వెల్లడించారు ఆమె. నాలుగు నెలల క్రితం తనకు కొంచెం అనారోగ్యంగా అన్పించి పరీక్షలు చేయించుకోగా..అందులో తనకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. అయినా అప్పటి నుంచి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ కు సంబంధించి ట్యూమర్ ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారన్నారు. అయితే ఈ ఆనందం తనకు ఎక్కువ సేపు నిలవలేదన్నారు. తనకు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదం ఉందని..ఈ మేరకు జెనెటిక్ మ్యూటేషన్ ఉన్నట్లు గుర్తించారని తెలిపారు.
మరోసారి బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి 70 శాతం ఛాన్స్ ఉందని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు. హంసానందిని ఈ విషయాలు అన్నీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే తాను తొమ్మిదిసార్లు కీమోథెరపి చికిత్స తీసుకున్నానని..ఇంకో ఏడు సార్లు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాధికి తన జీవితాన్ని నిర్దేశించే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానని..తాను విజయవంతంగా మళ్ళీ తెరపైన కన్పిస్తానని..ఈ సమస్య నుంచి వెనక్కి వచ్చి ఇతరులను ఎడ్యుకేట్ చేయటంతో పాటు స్పూర్తినింపుతానన్నారు. విచిత్రం ఏమిటంటే పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్లు చాలా మంది కూడా క్యాన్సర్ బారిన పడ్డారు.