వెన్నెలకంటి ఇకలేరు
టాలీవుడ్ లో విషాదం. ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వరప్రసాద్. ఆయన స్వస్థలం నెల్లూరు. ఆయన చెన్నయ్ లోనే స్థిరపడ్డారు. వెన్నెలకంటి రచించిన 'చిరునవ్వుల వరమిస్తావా..చితినుంచి బ్రతికొస్తాను...మరుజన్మకు కరుణిస్తావా..ఈ క్షణమే మరణిస్తాను', రాసలీల వేళ రాయబారమేల..మాటే మౌనమే..మాయజేయనేలా, మాటరాని మౌనమిది వంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆయన కలం నుంచి జాలువారాయి.
ఆయనకు ఇద్దరు తనయులు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి. అతను కూడా సినీ రచయిత. రెండవ తనయుడు రాకెందు మౌళి. డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్‌గా వెన్నెలకంటికి మంచి పేరు ఉంది. తమిళ సినిమాలకు కూడా లిరిక్స్ అందించారు. జంద్యాల రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన పని చేశారు.