బేబీ కాంబినేషన్ కు మళ్ళీ హిట్ దక్కిందా?!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లు జంటగా వచ్చిన బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ వచ్చింది. అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై. ఈ సినిమా టీజర్...ట్రైలర్ లోనే ఇందులోని కంటెంట్ ఎలా ఉండబోతుందో సంకేతాలు ఇచ్చారు. ఇటీవలే విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించిన ఈ సంస్థ ..ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేసుకునే ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ ని నిర్మించింది. నైంటీస్ వెబ్ సీరియస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది కూడా సినిమాపై అంచనాలు పెరగటానికి ఒక కారణంగా నిలిచింది అని చెప్పొచ్చు. సినిమా విడుదల శుక్రవారమే అయినా కూడా గురువారం రాత్రి ఈ మూవీ ప్రీమియర్ షోస్ వేశారు. ఇక సినిమా కథ విషయానికి ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్న మాట లివ్ ఇన్. ఈ ట్రెండ్ విదేశాల్లోనే కాదు..ఇప్పుడు దేశంలో కూడా పెద్ద ఎత్తున పెరిగింది.
హీరో ఆనంద్ దేవరకొండ డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయకుండా డైరెక్టర్ కావాలనే ఒకే టార్గెట్ తో పని చేస్తుంటాడు. కానీ ఎంతకూ అది ముందుకు సాగదు. దీంతో ప్లాన్ బి లో భాగంగా తల్లి తండ్రుల ఒత్తిడి మేర లండన్ వెళ్లి పీజీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. లోన్ తీసుకుని చదువుకోవటానికి వచ్చిన హీరో అక్కడ పార్ట్ టైం జాబ్ లు చేస్తూ తన కల డైరెక్టర్ కోసం కథలు రాసుకుంటూ ఉంటాడు. లండన్ కాలేజీ అడ్మిషన్స్ సమయంలోనే హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పరిచయం అవుతుంది. ఆ పరిచయం మరింత పెరిగి ఇద్దరూ లివ్ ఇన్ లో ఉంటారు. కడలి పాత్రలో కనిపించిన హీరోయిన్ వైష్ణవి ఇద్దరూ కలిసి ఉన్నా కూడా అది ఇక్కడ వరకే పరిమితం అని...ఇండియా వెళ్లిన తర్వాత ఎవరి జీవితం వాళ్లదే అని స్పష్టంగా చెపుతుంది. లివ్ ఇన్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ కావాలనే హీరో టార్గెట్ ఎందుకు పక్కదారి పడుతుంది...తర్వాత వీళిద్దరి కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నదే ఎపిక్ మూవీ.
హీరో ఆనంద్ దేవరకొండ ఏ మాత్రం లోకం తెలియని యువకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. లండన్ కాలేజీ లో అడ్మిషన్ సందర్భంగా వచ్చే సన్నివేశాలతో పాటు సినిమా అంతా అమాయకుడి పాత్రలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఎమోషనల్ సన్నివేశాల సమయంలో కూడా మంచి నటన చూపించాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఈ తరం అమ్మాయి గా స్టైలిష్ లుక్ లో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కాకపోతే ఇందులోని అడల్ట్ కంటెంట్ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రధానంగా మధ్య తరగతి ఫ్యామిలీల్లో ఉండే సవాళ్లు..లివ్ ఇన్ పేరుతో కలిసి ఉండే వాళ్లకు తర్వాత ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఈ సినిమా రెండవ భాగం కోసం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ను అర్దాంతరంగా ముగించినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో శివాజీ, వాసుకి, కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎపిక్ మూవీ ఓన్లీ యూత్ కు మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్ : 3 /5



