ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గ్లింప్స్ ఊచకోత మొదలు

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గ్లింప్స్ ఊచకోత మొదలైంది. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ గ్లింప్స్ ను ఏకంగా రెండున్నర కోట్ల మంది వీక్షించారు. ఈ జోష్ కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లోనే ఇది కొత్త రికార్డు లు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ముందు నుంచి ప్రచారం జరిగినట్లే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కు డ్రాగన్ టైటిలే ఫిక్స్ అయింది. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు కావటంతో చిత్ర యూనిట్ మంగళవారం రాత్రే డ్రాగన్ మూవీ గ్లింప్స్ విడుదల చేసింది. సహజంగా గ్లింప్స్ అంటే అతి తక్కువ నిడివితో వీడియోలు ఉంటాయి. కానీ రొటీన్ కు భిన్నంగా ఈ మూవీ గ్లింప్స్ ఏకంగా నాలుగు నిమిషాల 29 సెకన్లు ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీ కోసం తనదైన స్టైల్ లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఎన్టీఆర్ లుక్స్ లో బుగ్గలు పీక్కుపోయి కనిపించాడు. ఇది తప్ప గ్లింప్స్ అంతా ఆకట్టుకునేలా ఉంది.



