Telugu Gateway
Cinema

వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే రెండు మూవీలు

వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే రెండు మూవీలు
X

చిరంజీవి ఫ్యాన్స్ కు ఇక సినిమాల పండగే. వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఆయన నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి సినిమాల అతి పెద్ద పండగ అయిన సంక్రాంతి కి వస్తుంటే..రెండవ సినిమా వచ్చే వేసవి లో రానుంది. మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్ర యూనిట్లు ఈ సినిమా లకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చాయి. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవితో చేస్తున్న సినిమానే వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం నాడు ఈ మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ విషయాన్ని కూడా వెల్లడించారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ అయితే ఇప్పుడు ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ పెట్టారు.

శుక్రవారం నాడు విడుదల చేసిన గ్లింప్స్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్ ఇందులో ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. శుక్రవారం నాడు విడుదల చేసిన ఈ గ్లింప్స్ కు కూడా వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు సహజంగానే ఒక రేంజ్ కు పెరిగిపోతాయి. ఈ మూవీ కంటే ఎంతో ముందు మొదలైన విశ్వంభర సినిమా కూడా 2026 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా గురువారం నాడు వెల్లడించారు. ఈ సినిమా పూర్తి కావటానికి జరుగుతున్న జాప్యంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఎక్కువ వీఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో ఏ మాత్రం విమర్శలు రాకుండా పక్కాగా ప్లాన్ చేస్తూ..పనులు చేస్తున్నాం అని...ఈ విషయంలో దర్శక, నిర్మాతలు కూడా ఎంతో కృషి చేస్తున్నారు అన్నారు.విశ్వంభర సినిమా లో చిరంజీవి జోడిగా త్రిష, ఆషికా రంగనాథ్ లు నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు. దర్శకుడు వశిష్ట ఈ మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ అంటే మొదటి ఆరు నెలలు అంతా చిరంజీవి సినిమాల హంగామానే కొనసాగనుంది అన్నట్లు. గురువారం నాడే విశ్వంభర మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ సూపర్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

Next Story
Share it